ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్రకు ఏసీబీ నోటీసులు
– బాబు ఏ క్షణాన్నైన తాఖీదులు
గవర్నర్‌తో పోలీసు ఉన్నతాధికారులు, హైకోర్టు న్యాయమూర్తి భేటీ
హైదరాబాద్,జూన్16(జనంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఆర్‌పీసీ 160 సెక్షన్ ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నోటీసులతో హైదరాబాద్‌లో ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని సండ్ర నివాసానికి ఏసీబీ అధికారులు వెళ్లారు. కాగా ఏ క్షణానైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాకీదులు అందనున్నాయి.ఈ మేరకు చంద్రబాబు నివాసం వద్ద ఆంధ్రమంత్రుల హడావుడి మొదలైంది. నోటుకు ఓటు వ్యవహారంలో ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కేంద్రబిందువయ్యారు. ఇరు రాష్ట్రాల అధికారులు మంగళవారం గవర్నర్ నరసింహన్‌తో వరుస భేటీలు చేపట్టారు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భోస్టే కూడా గవర్నర్‌ను కలవడంతో ఊహాగానాలు అధికమయ్యాయి. ఉదయం నుంచి వరుస భేటీలతో గవర్నర్ నరసింహన్ బిజీగా ఉన్నారు. ఉదయం తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ, ఎసిబి డిజి ఎకె ఖాన్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తదితరులు కలిశారు. వీరంతా తాజా రాజకీయ పరిణామాలుగవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. ఇక గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సాయంత్రం భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతోన్న తాజా రాజకీయ పరిణామాలు, ఓటుకు నోటు కేసులో జరుగుతోన్న పరిణామాల నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ డీజీపీ కూడా గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్లో తమ భద్రతను తామే ఏర్పాటు చేసుకుంటామని ఏపీ మంత్రులు ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.. ఇదే విషయాన్ని వారు గవర్నర్‌కు తెలియచేసినట్లు సమాచారం.అంతకుముందు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గవర్నర్ను కలిశారు. హైదరాబాద్ శాంతిభద్రతల విషయం గురించి వీరు నరసింహన్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఏపీ సీఎస్, డీజీపీ కూడా ఇదే విషయం చర్చించినట్టు సమాచారం. దీనికి తోడు ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ఏసీబీ అధికారులు సమన్లు జారీ చేసే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ గవర్నర్ను కలిశారు. ఇదిలావుంటే హైదరాబాద్‌లో తమ భద్రతను తామే ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ పోలీసుల భద్రత తమకు అవసరం లేదని, సొంతంగా ఏపీ పోలీసులతో భధ్రత ఏర్పాటు చేసుకుంటామని మంత్రులు తీసుకున్న నిర్ణయాన్ని డిజిపి రాముడు గవర్నర్‌కు చేరవేసినట్లు సమాచారం. శాంతి భద్రతలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేతుల్లో ఉంటే తమకు అక్కర్లేదని చెప్పారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న పదేళ్లకాలంలో శాంతిభద్రతలు గవర్నర్ నరసింహన్ చేతిలో ఉంటే ఫర్వాలేదని అన్నారు. సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద, మంత్రుల నివాసాల వద్ద ఏపీ పోలీసులతో భద్రత ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నా శాంతిభద్రతలను తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇరు రాష్ట్రాల మధ్య శాంతి భద్రతల వివాదం ఏర్పడింది.