ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్ట్
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టీడీపీ ఎమ్మెల్యే
ఎమ్మెల్సీ ఓటుకు 50 లక్షలు ఇవ్వబోతుంటే పట్టుకున్న ఏసీబీ
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను మభ్యపెట్టేందుకు రేవంత్ యత్నం
హైదరాబాద్, మే 31(జనంసాక్షి) : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు లంచం ఇవ్వజూపుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తెలంగాణ తెదేపా శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న రేవంత్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. శాసన మండలి ఎన్నికల్లో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నించారని, ఇందులో భాగంగా రూ.50 లక్షలు అందజేస్తుండగా పట్టుకున్నట్లు అనిశా అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్ లాలాగూడ విజయపురి కాలనీలోని స్టీఫెన్‌సన్ సన్నిహితుడి ఇంట్లో ఆదివారం జరిగిన ఈ సంఘటనలో రేవంత్‌రెడ్డితో పాటు ఉదయ్‌సింహ అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ అనంతరం వారిని బంజారాహిల్స్‌లోని అనిశా ప్రధాన కార్యాలయానికి తరలించారు. అనంతరం రేవంత్‌రెడ్డిని అరెస్టు చేశారు. వారిద్దరి వాంగ్మూలం నమోదు చేసి సోమవారం అనిశా న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. తనను ఉద్దేశపూర్వకంగానే ఇందులో ఇరికించారని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తుండగా.. అనిశా అధికారులు మాత్రం దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. లంచం ఇస్తున్నారన్న ఆరోపణలపై శాసనసభ్యుడ్ని అనిశా అధికారులు పట్టుకోవడం ఈ మధ్యకాలంలో ఇదే ప్రథమం.
రాష్ట్రంలో జరగబోయే శాసనమండలి ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటు వేయాలని రేవంత్‌రెడ్డి కోరుతున్నారని, ఇందుకోసం తనకు భారీగా ముట్టజెబుతామని ప్రలోభపెట్టారని స్టీఫెన్‌సన్ అనిశా అధికారులకు సమాచారం ఇచ్చారు. మొత్తం రూ.5 కోట్లకు ఒప్పందం కుదిరిందని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. స్టీఫెన్‌సన్ నుంచి గత గురువారం అధికారులు రాతపూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం ఆదివారం ఉదయం రేవంత్‌రెడ్డిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదుచేశారు. స్టీఫెన్‌సన్ చెప్పినదాని ప్రకారం లాలాగూడలోని ఆయన బంధువు మాల్కం టేలర్ ఇంట్లో డబ్బు ముట్టజెప్పేందుకు అంగీకారం కుదిరింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రేవంత్‌రెడ్డి, మరో వ్యక్తి ఓ కారులో వచ్చారు. దీన్ని అనుసరిస్తూ మరో కారు వచ్చింది. అందులో నుంచి దిగిన మరో వ్యక్తితో కలిసి రేవంత్‌రెడ్డి ఫ్లాట్‌నెంబర్ ఎఫ్-4కు వెళ్లారు. అప్పటికే స్టీఫెన్‌సన్‌తో పాటు అనిశా అధికారులు కూడా ఆ ఇంట్లో ఉన్నారు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత నల్లరంగు సంచిలో నుంచి డబ్బు తీసి బయటపెట్టగానే అప్పటికే లోపల ఉన్న అనిశా అధికారులు పట్టుకున్నారు. ఆ గదిలో అనిశా అధికారులు ముందుగానే రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారని, గదిలో జరిగిన తతంగం అంతా రికార్డు చేశారని తెలుస్తోంది. బ్యాగులో నుంచి తీసిన రూ.500 నోట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి రూ.50 లక్షలు ఉన్నట్లు తేల్చారు. ఈ కట్టలపై బ్యాంకు ముద్రలు ఏవీ లేకపోవడం గమనార్హం. అనంతరం రేవంత్‌రెడ్డి, అతనితోపాటు వచ్చిన ఉదయ్‌సింహ అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపు వారిని ప్రశ్నించిన తర్వాత బంజారాహిల్స్‌లోని అనిశా ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ రేవంత్‌రెడ్డిని అరెస్టు చేశారు. సోమవారం ఆయన్ను న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. ఆయనతో పాటు ఉన్న ఉదయ్‌సింహను కూడా అరెస్టు చేయొచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించి అనిశా అధికారులు నోరు మెదపడంలేదు.