ఓవైపు అవమానపరుస్తూ మరోవైపు వేడుకలా!?
– బీహార్ సీఎం నితీష్
పాట్నా,ఏప్రిల్ 14(జనంసాక్షి):రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నవారు, అంబేడ్కర్ సిద్ధాంతాల పట్ల ఏమాత్రం విశ్వాసం లేని వారు ఆయన జయంతులు చేస్తున్నారని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వంపై మండి పడ్డారు. గురువారం పాట్నాలోని జేడీయూ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే వారు అంబేడ్కర్ పట్ల అమితమైన గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. బలహీనవర్గాల వారి ఓట్లు దండుకోవడానికే అంబేడ్కర్ పేరుతో మోదీ ప్రభుత్వం ప్రజల్లోకి వెలుతోందని.. వారికి బాబాసాహెబ్ సిద్ధాంతం పట్ల ఏమాత్రం విశ్వాసం లేదని విమర్శించారు.అంబేడ్కర్ సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి పోరాటం చేశాడని, బీజేపీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను విడదీయడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశంలోని యూనివర్సిటీల్లో దళిత విద్యార్థులు వేధించబడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. వారిని పట్టించుకోకుండా దళితుల ఓట్లకోసం వారి పట్ల ప్రేమను నటిస్తున్నారని ఆరోపించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ఏమాత్రం పాత్ర లేని వాళ్లు జాతీయవాదం గురించి విపరీతంగా మాట్లాడుతున్నారని నితీష్ అన్నారు.