కంటివెలుగు కోసం కసరత్తు

 

 

అధికారుల ఏర్పాట్లు

ఖమ్మం,ఆగస్ట్‌ 8(జ‌నం సాక్షి): ఈనెల 15వ తేదీన సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్న కంటివెలుగు పథకాన్ని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలో పకడ్బందీగా అమలు చేసేందుకు ముమ్మరంగా కసరత్తు జరుగుతున్నది. ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అవగాహన సదస్సులో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పథకం అమలు గురించి దిశానిర్దేశం చేసారు. ప్రజల అంధత్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టనున్న తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేదిశగా ఉమ్మడి జిల్లాల అధికారులు అడుగులు వేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10.7 లక్షలు, ఖమ్మం జిల్లాలో 14.39లక్షల జనాభాకు కంటిపరీక్షలు నిర్వహించే నిమిత్తం ఏర్పాటు చేయనున్న వైద్యశిబిరాల జాబితాను సిద్ధం చేశారు. మండలాలు, గ్రావిూణ ప్రాంతాల వారీగా వైద్య బృందాలను, వాటిల్లో పనిచేసే సిబ్బందిని ఏర్పాటు చేసిన యంత్రాంగం మెడికల్‌ ఆఫీసర్లను, కంటి వైద్య నిఫుణులను నియమించారు. ఏజెన్సీ జిల్లాగా పేరొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 31 మంది మెడికల్‌ ఆఫీసర్లు, 31 మంది కంటి వైద్యసహాయకులను నియమించారు. ఖమ్మం జిల్లాలో 26 మంది మెడికల్‌ ఆఫీసర్లు, 26 మంది కంటి వైద్య సహాయకులను ఏర్పాటు చేయగా తక్షణమే విధుల్లో చేరాలని కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. కార్యక్రమం అమలుకు మరో పదిరోజులు ఉన్నందున మండల,

గ్రావిూణ స్థాయిలో ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ యంత్రాంగానికి అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం తాజాగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నది. దీంతో రంగంలోకి దిగిన జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, డీఎస్‌ లోకేష్‌కుమార్‌ స్వీయపర్యవేక్షణ చేస్తున్నరు. వారి ఆదేశాల మేరకు భద్రాద్రి కోత్తగూడెం జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్‌ దయానందస్వామి, ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఏ కొండల్‌రావు విదివిధానాలను రూపొందిస్తున్నారు.