కఠినంగా వ్యవహరిస్తం
ఎలాంటి సమస్యనా ఎన్ని రోజులైనా చర్చిస్తాం
సీఎం కేసీఆర్
హైదరాబాద్,మార్చి9(జనంసాక్షి): సభను ఆటంకపరచి, సభను నడవకుండా కావాలని గొడవ చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీపడబోమని కూడా స్పష్టం చేశారు. శాసనసభలో సోమవారం సిఎం మాట్లాడుతూ సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఎన్ని రోజులైనా సమస్యలపై చర్చించగలమన్నారు. శాసనసభలో జాతీయగీతాన్ని అవమానపర్చిన వారెవరైనా సరే సభకు క్షమాపణ చెప్పాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో కేసీఆర్ మాట్లాడుతూ.. పని కట్టుకుని సభకు ఆటంకం కలిగిస్తే.. పని కట్టుకుని సస్పెండ్ చేస్తాం. కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. తాను 40 ఏళ్ల నుంచి చట్టసభల్లో ఉంటున్నా.. ఏనాడు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. టీడీపీ సభ్యులు తీరుమార్చుకోకపోతే గుణపాఠం తప్పదన్నారు. సభ్యులను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం సరికాదని, పునరాలోచన చేయాలని జానా సూచించారు. టిడిపి సభ్యుల సస్పెన్షన్‌పై కాంగ్రెస్ పక్షనేత జనారెడ్డి చేసిన సూచినపై సిఎం తీవ్రంగా స్పందించారు. ఏ పక్షం వారైనా సరే పద్దతిగా వ్రవర్తించాలి. కొందరి సభ్యుల ప్రవర్తన బాగాలేదని నేను చెప్పడం కాదు.. బయటి సమాజం కూడా అనుకుంటున్నదన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత, అసెంబ్లీ నడుస్తున్న సందర్భంలో వారు కావాలని సభను నడవనీయమన్న ధోరణిలో ఉన్నారని అన్నారు. బడ్జెట్ సమావేశాలను పొడిగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఏ సమస్యపైనా అయినా చర్చించడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు. సమావేశాలను జరగనివ్వకూడదని కొందరు అనుకుంటున్నారు. కానీ సభను జరిపి తీరుతాం. అన్ని నియమాలు, నిబంధనలు ప్రభుత్వానికి తెలుసు. జాతీయగీతాన్ని అవమానపర్చిన ఎవరైనా సరే సభకు క్షమాపణ చెప్పాల్సిందే. జాతీయగీతాన్ని అవమానించడమే కాకుండా.. గవర్నర్‌పై కాగితాలు వేసి అవమానపరిచారు. అధికార పక్షసభ్యులు ఒకవేళ జాతీయ గీతాన్ని అవమానపరిస్తే వారిపైనా చర్య తీసుకోవాల్సిందేనన్నారు. ఇందులో మరో మాటకు తావులేదన్నారు. అందరి సహకారంతో కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందాలి. సభ్యుల ప్రమాణస్వీకారం రోజున కూడా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ సభకు వచ్చారు. అన్ని సమస్యలపై చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపనా గొడవలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్ని రోజులైనా, ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధమన్న తరవాత గొడవ ఎందుకు చేస్తున్నారో తెలియంది కాదన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని సిఎం అన్నారు. కొంత మంది పనికట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, అందరం కలిసి సహకరించి ,దేశం అంతటా శెభాష్ అనిపించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సభ్యులు ప్రమాణం చేసిన తొలిరోజునే నినాదాలు చేసుకుంటూ వచ్చారని, అభ్యంతరకర భాష వాడుతున్నారని, అదే సంప్రదాయం అని ఆయన అన్నారు. అసంబద్దమైన , అవసరం లేని గందరగోళం సృష్టించడానికి టిడిపి సభ్యులు ప్రయత్నిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి వాటిని సహించడం హుందా తనం కాదని అన్నారు. వారిని మొత్తం సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేయడానికి నేపధ్యం ఉందని అన్నారు. వారి ప్రవర్తన కావాలనే ఒకే విధానంగా ఉందని, సభ కూడా జరగవలసిన అవసరం ఉందని కెసిఆర్ అన్నారు. రాజ్యాంగ విధులు కూడా నిర్వర్తించాల్సి ఉందని అన్నారు. వాయిదా తీర్మానం ప్రశ్నోత్తరాల తర్వాత ప్రస్తావించాలని అనుకున్న సంగతిని గుర్తుంచుకోవాలని అన్నారు. గవర్నర్ పై కూడా కాగితాల ఉండలు విసిరారని అన్నారు. బడ్జెట్ సమావేశాలను పొడిగించడానికి కూడా సిద్దమని చెప్పామని అన్నారు. కొద్ది మంది పనికట్టుకుని, అనవసర సందర్భం సృష్టించుకుని గొడవ చేస్తున్నారని కెసిఆర్ అన్నారు. సభ జరగినవ్వబోమన్న పంధాలో వెళుతున్నారని అన్నారు.అలాంటప్పుడు వారిని ఎలా అనుమతిస్తామని అన్నారు. శాసనసభ జరగనివ్వకూడదని కొందరికి ఉందని,దానిని జరిపి తీరుతామని అన్నారు. టిడిపి సభ్యుల సస్పెన్షన్ ఒకటి,రెండు రోజులకే పరిమితం చేయాలని బిజెపి, కాంగ్రెస్ నేతలు కోరినప్పుడు కెసిఆర్ సమాధానం ఇచ్చారు. నాలుగు రోజులు చూద్దామని అన్నారు. అప్పుడు వారంతా మనసు మార్చుకుని వస్తారా చూద్దాం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని చెడిపోకుండా గట్టిగా వ్యవహరిస్తామని,తెలంగాణ సమాజం కోసమే తాము ఈ చర్య తీసుకుంటామని అన్నారు. నిజానికి సెషన్ సస్పెన్షన్ చాలా చిన్నదని, అవసరమైతే మరింత కఠినంగా ఉంటామని ఆయన అన్నారు. వారిలో మార్పు వస్తే అప్పుడు చూద్దామని అన్నారు. ఒకటి,రెండు రోజులు పోయిన తర్వాత ఆలోచిద్దామని కెసిఆర్ అన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఇంకా కఠిన చర్యలు తీసుకోకుండా వదిలామని మంత్రి హరీష్ రావు చేసిన ప్రకటను సిఎం గుర్తు చేశారు. ఈ ఘటన దేశానికి అవమానకరమన్నారు.