కరువుపై సర్కారు కదలాలి

4

జెఎసి ఛైర్మన్‌ కోదండరాం

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో కరవు పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు వేగవంతం చేయాలని తెలంగాణ ఐకాస సూచించింది. సాగుతాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. నాంపల్లిలోని ఐకాస కార్యాలయంలో సమావేశమైన నేతలు రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో చేపట్టిన కరవు పర్యటనలో గుర్తించిన అంశాలను విూడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఐకాస ఛైర్మన్‌ కోదండరాం మాట్లాడుతూ.. దినదినం ఎండలు తీవ్రతరమవుతుండటంతో జలాశయాలు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటిన కారణంగా వ్యవసాయం దెబ్బతిందన్నారు. పశుపోషణ, చేతివృత్తులు తీవ్ర సంక్షోభంలో పడ్డాయన్నారు. కరవు కారణంగా పలుచోట్ల వివాహాలు వాయిదా పడ్డాయని తెలిపారు. ప్రభుత్వం కరవును లెక్కగట్టే ప్రమాణాల్లో మార్పురావాలన్నారు. జూన్‌ 2ను ఉద్యమకారుల ఆత్మగౌరవ దినోత్సవంగా జరపనున్నట్లు వెల్లడించారు. ఉపాధి కరవై ప్రజలు పట్టణాలకు వలస పోతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే కరవు సహాయక చర్యల్లో భాగంగా పింఛన్లు, పసుగ్రాసం అందించాలన్నారు. ఉపాధి హావిూ పనులు పెంచి వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆసరాలేని వృద్ధులు, వికలాంగులకు కూడా వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. కరవుపై తాము రూపొందించిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కమిషనర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలన్నీ కరవు సమస్యపై దృష్టిసారించాలని విజ్ఞప్తిచేశారు. జేఏసీ కరవు నివేదికను అన్ని ప్రజాసంఘాలకు అందించి ప్రభుత్వ స్పందనపై ఉమ్మడి కార్యాచరణ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితుల పై చర్చించడానికి త్వరలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరాం తెలిపారు. తెలంగాణలో కరువు తీవ్రంగా ఉందన్నారు. కరువు సహాయక చర్యల్లో లోపాలున్నాయని తెలిపారు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదన్నారు.  నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పాలేరు ఉప ఎన్నికతో తమకు సంబంధం లేదన్నారు. జూన్‌ 2న ఉద్యమకారుల ఆత్మగౌరవ దినంగా నిర్వహిస్తామన్నారు. ఉద్యమకారుల త్యాగాలను ఆ రోజు గుర్తు చేసుకుంటామన్నారు.