కర్ణాటకతో చర్చలు సఫలం
– మంత్రి హరీశ్ రావు
బెంగళూరు,ఏప్రిల్ 28(జనంసాక్షి): బెంగళూరు పర్యటనలో ఉన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజల తాగునీటి అవసరాల కోసం నారాయణపూర్ డ్యాం నుంచి జూరాల ప్రాజెక్టుకుతక్షణం మూడు టీఎంసీల నీళ్లు వదలాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక ఇరిగేషన్ మంత్రికి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని ప్రజలుమంచినీటికోసం అగచాట్లు పడుతున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఈ సందర్భంగా మంత్రులు వినతి చేశారు. రాజోలిబండ ఆధునీకీకరణ కోసం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వానికి రూ.52 కోట్లు డిపాజిట్ చేసిందన్నారు. మిగిలిన నిధులు ఇస్తాం.. పెండింగ్ పనులు పూర్తి చేయాలని హరీష్ బృందం మంత్రి పాటిల్‌ను కోరింది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గురువారం ఉదయం బెంగళూరు చేరుకుని కర్ణాటక నీటిపారుదలశాఖ మంత్రి ఎంబీ పాటిల్‌తో సమావేశమయ్యారు. రాజోలిబండ నీటి మళ్లింపు పథకం ఎత్తు పెంపుపై చర్చించారు. ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపు ఉన్నప్పటికీ ఐదారు టీఎంసీలకు మించి రావట్లేదు. కాలువల ఆధునికీకరణ చేపట్టినా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో పనులు త్వరగా పూర్తి చేయించడానికి కర్ణాటకతో చర్చించారు