కర్రపెత్తనాన్ని ఎత్తిచూపిన కోర్టు

రాజ్యాంగం అపహాస్యం పాలయినప్పుడు, అధికారం చేతిలో అది కీలుబొమ్మయినప్పుడు కోర్టులు జోక్యం అనివార్యంగా మారుతోంది. ఉత్తరాఖండ్‌లో ఇదే జరిగింది. ఉత్తరాఖండ్‌ తీర్పు కేంద్రంలో అఉన్న అధికార పార్టీకి గుణపాఠం కావాలి. కేంద్రం కర్రపెత్తనం చేస్తోందంటూ తీర్పు ద్వారా గట్టిగా చెప్పింది. ఇలాంటి తీర్పులు దుందుడుకు రాజకీయ చర్యలకు హెచ్చరిక కానున్నాయి. అంతేకాదు దీనిపై చంకలు గుద్దుకుంటున్న కాంగ్రెస్‌ కూడా గత తప్పిదాలను నెమరేసుకోవాలి. భవిష్యత్‌లో ఇలాంటి తప్పిదాలు జరక్కుండా చూసుకోవాలి. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టడంతో  కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బతగిలిందనే చెప్పాలి. ఏదైనా రాష్‌టరంలో అస్థిర పరిస్థితులు సృష్టించడం లేదా దాని మెడపై కత్తి పెట్టడం లాంటి చర్యలకు ఈ తీర్పు గుణపాఠం కావాలి. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్రం దానికి భిన్నంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించిన హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు భవిష్యత్‌లో ఇలాంటి చర్యలకు ఓ లక్ష్మణ రేఖ కావాలి.  రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ ఉత్తరాఖండ్‌ ఇచ్చిన తీర్పు కనువిప్పు కావాలి. అయితే, ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 27న ఉత్తరా ఖండ్‌లో కేంద్రం రాష్ట్రపతిపాలన విధించి అక్కడ ప్రజాస్వామ్యానికి పాతర వేసింది. బిజెపి కూడా గత కాంగ్రెస్‌ లాగానే పాలన సాగిస్తోందనడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు.ఈ ఉత్తర్వులను కొట్టేసిన హైకోర్టు ధర్మాసనం ఏప్రిల్‌ 29న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో బలపరీక్ష జరగాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను కొట్టివేసి, హరీష్‌ రావత ప్రభుత్వాన్ని పునరుద్ధరించి, ఏప్రిల్‌ 29వ తేదీన బలపరీక్ష జరగాలని ప్రకటిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం కానుంది. భవిష్యత్‌లో రాష్టాల్ర పట్ల కేంద్రం అనుసరించే తీరుకు ఇది హెచ్చరికగా ఉండనుంది.  నరేంద్రమోదీ ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బగానే భావించాలి.  హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, శుక్రవారం ఉదయమే సుప్రీంకోర్టును ఆశ్రయించి, ప్రధాన న్యాయమూర్తి నుంచి ఈ తీర్పును నిలిపివేయిస్తూ ఉత్తర్వులు సాధించాలని కేంద్రం తక్షణమే నిర్ణయించుకుంది. సుప్రీంకోర్టు ఏం చెప్పబోతున్నప్పటికీ, ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుకూ, ఈ సందర్భంలో చేసిన పలురకాల వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. హైకోర్టు తీర్పు తమను పెద్దగా ఆశ్చర్యపరచలేదనీ, ఇందుకు భిన్నంగా ఉండివుంటేనే నిశ్చేష్టులమయ్యేవారమని భారతీయ జనతాపార్టీ నాయకులు అంటున్నారు. నిజంగా ఇది మేకపోతు గాంభీర్యం తప్ప మరోటి కాదు. ఈ తీర్పులోని ఔచిత్యం, న్యాయం కంటే, న్యాయమూర్తులు చేసిన కఠిన వ్యాఖ్యలు వారికి ప్రధానంగా అందివస్తాయి. అటార్నీ జనరల్‌ చెప్పిన దాదాపు ప్రతి సమాధానంపైనా ఇద్దరు న్యాయమూర్తులూ ఏదో ఒక వ్యాఖ్య చేస్తూనే వచ్చారు. ఆశ్చర్యమేమంటే, అంతిమ తీర్పును రిజర్వులో పెట్టిన న్యాయస్థానం, కేంద్రాన్ని ఏమాత్రం విశ్వసించని కారణంగా గురువారమే దానిని ప్రకటించింది. నిజానికి ఇది అసలు తీర్పు కంటే అధిక అవమానం. ప్రభుత్వం విూద మాకు ఏ మాత్రం నమ్మకం లేదని ఢంకా బజాయించి మరీ న్యాయస్థానం ఈ తీరుపును ఇచ్‌ఇచందా అన్నరీతిలో ఉంది. న్యాయ సవిూక్షకు లోబడనిదంటూ ఏదీవుండదనీ, రాష్ట్రపతి కూడా తప్పు చేయవచ్చంటూ ప్రధాన న్యాయమూర్తి జోసెఫ్‌, న్యాయమూర్తి బిస్త్‌ చేసిన వ్యాఖ్యలనుబట్టి చూస్తే రాజ్యాంగానికి ఎంతగా ఆపద వచ్చిందో గుర్తు చేశారు. ఎలా దానిని వక్రీకరిస్తున్నారో చెప్పారు. దీనిని రాష్ట్రపతిపై విమర్శగానో, ఆ పదవికున్న పవిత్రతను దిగజార్చేవిగానో అభివర్ణించడం సముచితం కాదు. నిరంకుశాధికారాలకు ప్రజాస్వామ్యంలో తావులేదనీ, ఎవరెంత గొప్పయినా న్యాయం వారికన్నా ఉన్నతమైనదని ఉద్ఘాటించడమే  ప్రధానోద్దేశమని న్యాయమూర్తులు ప్రకటించారు.  రాష్ట్రపతి తన రాజకీయ వివేచన ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారని అటార్నీ జనరల్‌ అన్నప్పుడు, రాష్ట్రపతికి గవర్నర్‌ నివేదించిన అంశాలపై న్యాయస్థానం చేసిన విశ్లేషణ ఎంతో ముఖ్యమైనది. ఉత్తరాఖండ్‌లో కేంద్రం వ్యవహరించిన తీరు న్యాయస్థానాన్ని బాగా కలవరపరిచింది. ఆగ్రహం కలిగించింది. తొమ్మిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో కేంద్రానికి ఎందుకింత ఆపేక్ష అనీ, ప్రజాస్వామ్య మూలాలను తెగ్గోస్తున్నారనీ కేంద్రాన్ని చాలా మాటలు అన్నది. ఈ విషయంలో ఎత్తులకూ జిత్తులకూ పాల్పడకండి అంటూ కొద్దిరోజుల క్రితమే విస్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన న్యాయస్థానం, ఇప్పుడు రెచ్చగొట్టరనే భావిస్తున్నానంటూ ఆకాంక్షించింది.రాష్ట్ర పతి పాలన విధింపు విషయంలో కేంద్రం చర్యల పట్ల కోర్టు బాధ పడిందని వ్యాఖ్యా నించారు. కేంద్రం ప్రైవేటు పక్షంలా వ్యవహరి స్తోందన్నారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్రం ఈ తీరున వ్యవహరించడం విచారకరమని అన్నారు. కోర్టుతో ఆటలాడాలని ఎలా అనుకుంటారని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రం 356వ అధికరణను రద్దు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే అది న్యాయాన్ని అవహేళన చేయడమేనని జోసెఫ్‌ వ్యాఖ్యానించారు. దాంతో కేంద్రం స్పందిస్తూ, ఏదైనా చర్య తీసుకోవడానికి ముందుగా కోర్టుకు తెలియచేస్తామని బెంచ్‌కు హావిూ ఇచ్చారు. ఇప్పటికే రాజకీయంగా, న్యాయపరంగా అనేక మలుపులు తిరిగిన ఉత్తరాఖండ్‌ వ్యవహారాన్ని నేడు సుప్రీంకోర్టు ఏ దిశగా మళ్ళిస్తుందో చూడాలి. ఏదేమైనా కేంద్‌రం రాష్టాల్రపై కర్రపెత్తనాలకు కాలం చెల్లిందని మాత్రం ఈ తీర్పురుజువు చేసింది.