హిమాచల్ ప్రదేశ్‌లో రెడ్‌అలర్ట్
` హెచ్చరిక జారీ చేసిన అధికారులు
` కొనసాగుతున్న వర్ష బీభత్సం
` భారీ వరదల ధాటికి అల్లకల్లోలంగా రాష్ట్రం
` 75కు చేరిన మృతులు
` ఒక్క రోజులోనే 115-204 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు
సిమ్లా(జనంసాక్షి):హిమాచల్ ప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 75కు చేరింది.రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండచరియలు విరిగిపడటం.. మెరుపు వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా ఉంది. చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 240 రహదారులపై రాకపోకలు కష్టంగా మారినట్లు అధికారులు వెల్లడిరచారు. వీటిల్లో ఒక్క మండి జిల్లాలోనే 176 మార్గాలున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఒక్క రోజులో 115-204 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 204 మిల్లీ మీటర్లు అతి తీవ్ర వర్షపాతం కిందకు వస్తుంది.హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో చంబా, కంగ్రా, మండి, శిమ్లా, సిర్మూర్ జిల్లాల్లో మెరుపు వరదలు రావొచ్చని హెచ్చరించింది. ఉనా, బిలాస్‌పుర్, హమిర్‌పుర్, చంబా, శిమ్లా, కుల్లు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. చాలా చోట్ల కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందన్నారు. బలహీనమైన నిర్మాణాల్లో ప్రజలను ఉండొద్దని హెచ్చరించారు.ఐటీబీపీ దళాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. దీనికి తోడు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సాయం తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ప్రభుత్వానికి సూచించారు.