సాగునీటి ప్రాజెక్టులపై, సాగర్‌కట్టపై చర్చకు సవాల్
` ఆకలితీర్చే ఆయుధం,ఆత్మగౌరవం రేషన్ కార్డు
` పదేళ్లలో బీఆర్‌ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు
` పేదలకు సన్నబియ్యం ఊసే ఎత్తలే
` కొత్తగా 3. 58 లక్షల రేషన్ కార్డుల పంపిణీ
` కొత్త రేషన్ కార్డుల ద్వారా 11.3 లక్షల మందికి లబ్ధి
` బీఆర్‌ఎస్ హయాంలో బెల్ట్ షాపులకే ప్రాధాన్యం
` రైతులకు రుణమాఫీ…బోనస్ ఇచ్చిన ఘనత మాది
` కేసీఆర్ కాళేశ్వరం..కూలేశ్వరంగా మారింది
` నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీ చేసిన సీఎం రేవంత్
‘‘పదేళ్లు అధికారంలో ఉన్నా పేదలకు రేషన్ కార్డు, సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన భారత రాష్ట్ర సమితి నేతలకు రాలేదు. మా ప్రభుత్వం 3.10 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తే రేషన్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. వ్యవసాయం దండగ కాదు పండగ అని గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చాం.’’ – రేవంత్ రెడ్డి, సీఎం
నల్గొండ(జనంసాక్షి):బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదవాడికి సన్న బియ్యం ఇచ్చి.. గుక్కెడు ముద్ద పెట్టాలని ఆలోచన సైతం గత ప్రభుత్వంలోని పెద్దలు చేయలేదని మండిపడ్డారు. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. రూ. 34. 20 కోట్ల విలువైన పనులు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి అన్నారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం గుర్తింపు అన్నారు. ఆకలి తీర్చే ఆయుధమని తెలిపారు. తెలంగాణలో కొత్తగా 3. 58 లక్షల రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నట్లు- వివరించారు. కొత్త రేషన్ కార్డుల ద్వారా 11.3 లక్షల మందికి లబ్ధి చేకూరతుందన్నారు. తెలంగాణలో మొత్తం 95. 56 లక్షల మంది రేషన్ కార్డులు అందుకున్నారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విపులీకరించారు. నల్గొండ చరిత్రే.. తెలంగాణ చరిత్ర అని కొనియాడారు. జిల్లా అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రేషన్ షాపులు తెరవలేదని.. బెల్ట్ షాపులు తెరిచారంటూ వ్యంగ్యంగా అన్నారు. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తుంటే.. ఓర్వ లేక తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. రైతు పండిరచిన పంటను కొనుగోలు చేస్తున్నామని.. రైతుకు బోనస్ సైతం ఇస్తున్నామని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల వల్లే నేడు నల్గొండ జిల్లాకు నీళ్లు వస్తున్నాయని గుర్తు చేశారు. పోరాట యోధులను అందించిన గడ్డ నల్గొండ అని ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పిన తమ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. అయితే తమ ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టిందంటూ దుష్పచ్రారం చేశారని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతులకు రైతు భరోసా నగదు అందించామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. 18 నెలల్లో మహాలక్ష్మీ పథకంలో భాగంగా ప్రవేశపెట్టి మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి రూ. 6, 500 కోట్లు ఖర్చు అయిందని వివరించారు. తమ ప్రభుత్వం కొలువు తీరి రెండేళ్లు పూర్తయ్యే సరికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం.. ఆయన హయాంలోనే కూలేశ్వరం అయ్యిందని ఎద్దేవా చేశారు. కూలేశ్వరం ప్రాజెక్టు దగ్గరే వారిని ఉరి తీసినా తప్పు లేదన్నారు. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా? అంటూ బీఆర్‌ఎస్ నేతలకు ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. మూడు అడుగులున్న స్థానిక నేత ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లు అవకాశం ఇచ్చినా తుంగతుర్తికి నీళ్లు ఎందుకు తేలేదంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సీఎం సూటిగా ప్రశ్నించారు. తుంగతుర్తికి నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదంటూ బీఆర్‌ఎస్ నేతకు ఈ సందర్భంగా చురకలంటించారు. దొర ముందు చేతులు కట్టుకుని గ్లాస్‌లో సోడా పోయడమే నీకు తెలుసంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై మండిపడ్డారు. సొంత మండలానికి ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీస్‌లే కాదు.. పోలీస్ స్టేషన్ సైతం తెచ్చుకోలేని ఘనత బీఆర్‌ఎన్ నేతలదంటూ వ్యంగ్యంగా అన్నారు. . నాడు గంజికి లేని మూడు అడుగుల నాయకుడు.. నేడు బెంజి కార్లలో తిరుగు తున్నారంటూ జగదీశ్వర్ రెడ్డిపై వ్యంగ్య బాణాన్ని సీఎం రేవంత్ రెడ్డి సంధించారు. పదేళ్లు అధికారంలో ఉన్నా పేదలకు రేషన్ కార్డు, సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన బీఆర్‌ఎస్ నేతలకు రాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3.10 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేశామని.. రేషన్ దుకాణాల వద్ద జనాలు బారులు తీరుతున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చామని.. వ్యవసాయం దండగ కాదు.. పండగలా చేశామన్నారు. దేశం తలెత్తుకునేలా వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. రైతు రాజు అయినప్పుడే ఇందిరమ్మ ఆత్మశాంతిస్తుందని ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం సహాయక సంఘాలను పట్టించుకోలేదు. మేము అధికారంలోకి వచ్చిన తరువాత స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ బంకులు అప్పగించాం. ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ పవర్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మూడు అగుడుల వ్యక్తి నన్ను అడ్డుకుంటానని అంటున్నాడు. గ్లాసులో సోడా పోసినంత ఈజీ కాదు.. గోదావరి నీళ్లు తేవడం. ఒక్కసారి అడ్డుకుని చూడు, మా దామన్న చూసుకుంటాడని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ తదతరులు పాల్గొన్నారు.
2035లోపు తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాం
` సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):రామాయణం, మహాభారతం మన జీవితాల్లో భాగమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘శ్రీమద్భాగవతం-పార్ట్1’ చిత్రీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు.సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ దీన్ని రూపొందిస్తోంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.‘’రామోజీ ఫిల్మ్‌సిటీలో శ్రీమద్భాగవతం చిత్రీకరణ రాష్ట్రానికి గర్వకారణం. రామోజీరావు ఫిల్మ్‌సిటీని అద్భుతంగా నిర్మించారు. నేను యూనివర్సల్ స్టూడియో చూడలేదు. రామోజీ ఫిల్మ్‌సిటీ.. దేశంలోనే ప్రత్యేకమైన స్టూడియో. ఇది తెలంగాణలో ఉందని చెప్పేందుకు గర్విస్తున్నా. శ్రీమద్భాగవతం సినిమా తీయాలన్న ఆలోచన వచ్చినందుకు మూవీ టీమ్‌ను అభినందిస్తున్నా. నలభయేళ్ల క్రితం రామాయణం సీరియల్ అందరికీ చేరువైంది. కొవిడ్ సమయంలో మళ్లీ ఆ సీరియన్‌ను టెలికాస్ట్ చేస్తే ప్రపంచ రికార్డు సృష్టించింది.2035లోపు తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని మేం సంకల్పించాం. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా ఉండేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దీనికోసం 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకుంటున్నాం. ఇందులో సినీ రంగానికి ప్రత్యేక చాప్టర్ ఉంటుంది. నాడు రామానంద్ సాగర్ తీసిన రామాయణం సీరియల్ ఎంత పాపులర్ అయిందో.. ‘శ్రీమద్భాగవతం పార్ట్-1’ కూడా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.