కలియుగ కర్ణుడు
– యావత్‌ఆస్తి దానం
వాషింగ్టన్,సెప్టెంబర్ 3(జనంసాక్షి):యూనివర్శిటీ చదువు పూర్తవగానే కొందరు వ్యాపారాలు చేస్తే.. మరికొందరు ఉద్యోగం చేస్తూ జీవితంలో స్థిరపడతారు. పేరు.. డబ్బులు సంపాదిస్తారు. కొందరు తాము చదువుకున్న యూనివర్శిటీ రుణం తీర్చుకునేందుకు వర్శిటీకి కావాల్సిన సామగ్రినో.. కొంత డబ్బునో విరాళంగా ఇస్తుంటారు. కానీ.. ఓ సామాన్య వృద్ధుడు మాత్రం తాను జీవితాంతం చెమటోడ్చి సంపాదించిన డబ్బునంతా యూనివర్శిటీకే విరాళంగా ఇచ్చేశాడు. అమెరికాకు చెందిన రాబర్ట్ మొరిన్ అనే 77ఏళ్ల వృద్ధుడు న్యూ హంప్‌షైర్ యూనివర్శిటీలో 1961లో డిగ్రీ పూర్తి చేసి.. అందులోనే లైబ్రేరియన్‌గా ఉద్యోగంలో చేరాడు. 50ఏళ్లు అక్కడే విధులు నిర్వర్తిస్తూ.. గత ఏడాది మరణించాడు. అయితే తాజాగా న్యూహంప్ షైర్ యూనివర్శిటీకి మొరిన్‌కి చెందిన 4 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 27కోట్ల రూపాయలు) చెక్కు అందింది. మొరిన్ మరణాంతరం తాను సంపాదించిన డబ్బు అంతా యూనివర్శిటీకే చెందాలని తన ఆర్థిక సలహాదారుతో చెప్పాడట. అందుకే అతను యూనివర్శిటీకి ఆ చెక్‌ను అందించారు. దీంతో యూనివర్శిటీలో లైబ్రేరియన్‌గా పని చేసిన ఒక ఉద్యోగి నుంచి కోట్ల రూపాయల విరాళం రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొరిన్ జీవితకాలంలో ఎప్పుడూ విహారయాత్రలకు వెళ్లలేదని.. ఎక్కువగా ఖర్చు చేసేవాడు కాదని.. పాత కారులోనే తిరిగేవాడని మొరిన్ ఆర్థిక సలహాదారు తెలిపారు. మొరిన్ పంపించిన డబ్బులో లక్ష డాలర్లు లైబ్రరీ అభివృద్ధికి.. మిలియన్ డాలర్లు యూనివర్శిటీ ఫుట్‌బాల్ స్టేడియం మరమ్మతులకు ఖర్చు చేస్తామని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. మిగతా డబ్బుతో విద్యార్థుల కోసం ఒక కెరీర్ సెంటర్‌ను స్థాపించనున్నారట.జ్ఞానాన్ని నేర్పి.. జీవితాన్ని ఇచ్చిన చదువులగుడికి సంపన్నులు కొంత డబ్బును ఇవ్వడం సాధారణమే కానీ.. సాధారణ ఉద్యోగి తన ఆస్తినంతా విరాళంగా ఇవ్వడం నిజంగా గొప్ప విషయమే కదా!