కాకుమానులో కుక్కలదాడిలో చిన్నారి మృతి

5

గుంటూరు,ఏప్రిల్‌15(జనంసాక్షి): గుంటూరు జిల్లాలో విషాదకర సంఘటన జరిగింది. వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. ఆరేళ్ల చిన్నారిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. దీంతో ఆ చిన్నారి కుటుంబమంతా కన్నీరుమున్నీరుగా విలపించింది. గుంటూరు జిల్లాలోని కాకుమానులోగల ముస్లిం కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. కాకమాను పంచాయతీ పరిధిలోని మైనారిటీ కాలనీకి చెందిన షేక్‌ కౌసర్‌(6) అనే చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. దాదాపు పదికుక్కుల ఒక్కసారిగా విూదకు దూకి కరచి చంపాయి. దీంతో తీవ్ర గాయాలైన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం 10.30 గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు పుసునూరు రహాదారి వైపు వెళ్లిన బాలికపై 10 కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. బాలిక తల, పొట్టపై కరిచి పేగులు బయటకు తీశాయి. దీంతో బాలిక అక్కడిక్కడే మృతి చెందింది. కాకుమానులో కుక్కల బెడద అధికంగా ఉందని, బయటకు వెళ్లాలంటేనే భయంభయంగా ఉంటోందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలిక మృతితో ఆగ్రహం చెందిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. తమకు న్యాయం జరిగేంతవరకు ఆందోళన విరమించేది లేదని మృతురాలి బంధువులు పేర్కొన్నారు. ఆందోళన కారణంగా రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  కొద్ది రోజుల క్రితం ఇదే గ్రామంలో కుక్కల దాడి చేయడంతో ఓ బాలిక తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. అయినా గ్రామపంచాయతీ కాని,సంబంధిత సిబ్బంది కాని పట్టించుకోకపోవడంతో ఇప్పుడు మరో బాలిక మరణించడం ఆందోళన కలిగించే అంశమే. దీనిపై గ్రామస్తులు రోడ్డుపై ఆందోళనకు దిగి భైటాయించారు.దీనికి బాద్యులైన వారిపై ర్యలు తీపుకోవాలని కోరుతున్నారు. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక మృతిచెందడంతో ఆగ్రహించిన బంధువులు… మృతదేహంతో గుంటూరు-కాకుమాను రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఇదిలావుంటే కుక్కల బెడదపై 6నెలలుగా ఫిర్యాదులు వస్తున్నాయని కాకుమాను సర్పంచ్‌ మధుసూదన్‌రావు తెలిపారు. మంగళగిరి నుంచి ఒక బృందాన్ని పిలిపించి కుక్కలను నియంత్రించామని చెప్పారు. స్థానిక పీహెచ్‌సీలో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.

మరోవైపు కాకుమానులో కలెక్టర్‌ కాంతిలాల్‌ దండె పర్యటించారు. రోజు ఉదయం కుక్కల దాడిలో మృతిచెందిన బాలిక కుటుంబాన్ని కలెక్టర్‌ పరామర్శించారు. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తామని వారికి హావిూ ఇచ్చారు. కుక్కల బెడద నిర్మూలిస్తామని కలెక్టర్‌ హావిూ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. ఇదిలావుంటే  కాకుమానులో కుక్కలదాడిలో బాలిక మృతిచెందిన సంఘటనపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దిగ్భాంతి వ్యక్తంచేశారు. కుక్కల నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కర్నూలు పర్యటనలో ఉన్న మంత్రి అధికారులకు ఫోన్‌ చేసి మాట్లాడారు.