కాగ్ అక్షింతలతోనైనా కళ్లు తెరిచేనా?
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొంది. జలయజ్ఞం అమలులో లోపాలను సవివరంగా పేర్కొంటూ ఇకపై అలాంటి తప్పులు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణాలను బయటపెట్టిన కాగ్ జలయజ్ఞంలోనే అవకతవకలను, అవినీతి జాడలను ఎత్తి చూపింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు శుక్రవారం (21.06.2013) కాగ్ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో కళ్లు చెదిరే అనేక విషయాలను కాగ్ ప్రస్తావించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రికగా పేర్కొనే జలయజ్ఞంలో వేల కోట్ల రూపాయలు దారి మళ్లాయని వివరించింది. 26 ప్రాజెక్టులతో మొదలైన జలయజ్ఞం 86 ప్రాజెక్టులకు చేరడం, 2008-09 ఆర్థిక సంవత్సరంలో అనుమతుల్చిన ప్రాజెక్టులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం వెనుక భారీ మతులబే దాగుందని కాగ్ కడిగి పారేసింది. జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్వహణ నవగ్రహాలుగా పేరుపొందిన తొమ్మిది కాంట్రాక్టు సంస్థలకు నిబంధనలు తోసిరాజని పనులు కట్టబెట్టడం, వాటిలో ఎనిమిది కాంట్రాక్టు సంస్థలకే 1,47,120 కోట్ల రూపాయల విలువైన 168 ప్యాకేజీలు కట్టబెట్టడం, ఒక కంపెనీ 23 సంస్థలతో, మరో కంపెనీ 20 సంస్థలతో, మరో రెండు కంపెనీలు 17 సంస్థలతో, ఇంకో మూడు కంపెనీలు 8 సంస్థలతో భాగస్వామ్యం ఉంటూ పనులు పొందడాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. రాష్ట్రంలో 1.83 లక్షల కోట్లతో చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతి జరిగినట్టు కాగ్ నివేదిక తేటతెల్లం చేసింది. 2004లో రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞానికి సింహభాగం నిధులు కేటాయించారు. ధన ప్రవాహమున్న శాఖ ద్వారా నమ్ముకునే వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కుట్రలు పన్నారని ఇంతకాలం ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. వారి ఆరోపణలను నిజం చేసే రీతిలోనే కాగ్ నివేదిక కళ్లు చెదిరే నిజాలు బయటపెట్టింది. రెండేళ్లలో 8 ప్రాజెక్టులు, ఐదేళ్లలో 18 ప్రాజెక్టులు పూర్తి చేస్తామంటూ ప్రారంభించిన జలయజ్ఞం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. ప్రాజెక్టుల సంఖ్యను 86కు పెంచారు తప్ప ఒక్కటీ పూర్తి చేయలేదు. మొదట చేపట్టి 26 ప్రాజెక్టుల్లో 278 ప్యాకేజీలు ఉండగా వాటిలో 180 ప్యాకేజీలను అధ్యయనం చేసిన కాగ్ మొత్తం 74 ప్రాజెక్టులను పరిశీలించింది. శాస్త్రీయంగా టెండర్లు పిలిచి, ఎలాంటి దురాశ లేకుండా ఒప్పందాలు చేసుకొని, నిర్దేశిత సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే 74 ప్రాజెక్టులు 91,574 కోట్లతో పూర్తయ్యేవని కాగ్ తెలిపింది. పనుల్లో తీవ్రమైన జాప్యం కారణంగా ఖర్చు విపరీతంగా పెరిగి తడిసి మోపెడైందని, 1,43,690 కోట్ల రూపాయలకు చేరిందని తద్వారా 52,116 కోట్ల వ్యయం పెరిగిందని లెక్క తేల్చింది. ఈ మొత్తం నిర్దారిత వ్యయానికి 56.91 శాతం అధికమని పేర్కొంది. ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం భారీగా పెంచేసినా అనుకున్న స్థాయిలో పనులు సాగలేదని, కాంట్రాక్టర్లు మట్టి పనులు మాత్రమే చేసి భారీ మొత్తంలో బిల్లులు పొందారని పేర్కొంది. ప్రాజెక్టు ఒప్పంద నిర్మాణం వ్యయంలో 75 శాతం అప్రధాన్య పనులకే ఖర్చు చేశారని కడిగి పారేసింది. అయినా పనులు పూర్తికానందున, మార్కెట్‌లో ధరలు పెరిగినందున మళ్లీ ప్రాజెక్టు నిర్మాణం వ్యయం పెంచాలంటూ కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారని తేటతెల్లం చేసింది. 40 శాతం మాత్రమే నీటి లభ్యత ఉన్నా, 30 రోజులు మాత్రమే వచ్చే వరద నీటిపై ఆధారపడి కృష్ణా, పెన్నా నదులపై పదుల సంఖ్య ప్రాజెక్టులు చేపట్టడం తప్పని పేర్కొంది. ప్రాజెక్టులను పద్ధతి ప్రకారం కొన్ని సంస్థలకే (ఎంప్యానెల్‌మెంట్ ఆఫ్ కాంట్రాక్టర్స్ – ఈపీసీ) కట్టబెట్టారని ఆరోపించింది. ప్రపంచమంతా ఫిడిక్ నిర్దేశించిన ఈపీసీ విధానాన్ని అనుసరిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తాము నిర్ణయించిన వారికే పనులు కట్టబెట్టిందని తెలిపింది. కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేందుకు పనులను విభజించి ప్యాకేజీలుగా మార్చారని, తద్వారా కొందరికీ భారీ లబ్ధి చేకూరిందని పేర్కొంది. ఇలా చేసినందువల్ల కాంట్రాక్టర్లకు 3129.51 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని కాగ్ నివేదికలో తెలిపింది. కాంట్రాక్టర్ల మధ్య పోటీ ఉంటే ప్రభుత్వం నిర్దేశించిన వ్యయం కంటే తక్కువకే టెండర్ దక్కించుకునే అవకాశముంటుంది. కానీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంలో అనుభవమున్న సంస్థల పేరుతో కొందరికే పనులు కట్టబెట్టాలని ముందస్తుగా నిర్ణయించారు. పనులు ఎక్కువ, కాంట్రాక్టర్లు తక్కువ ఉన్న కారణంగా సింగిల్ టెండర్లును ఆమోదించారు. వాటి విలువ రూ.7861.11 కోట్లు. ఎల్లంపల్లి, లింగాల కాల్వ, హంద్రీ-నీవా, పోలవరం, గాలేరు -నగరి, తోటపల్లి, నెట్టెంపాడు, దేవాదుల ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు నీటి పారుదల శాఖ అదనపు చెల్లింపులు చేసింది. వారి నుంచి 439.78 కోట్లు రికవరీ చేయాల్సి ఉంది. కృష్ణా, పెన్నా బేసిన్లో నీటి లభ్యత లేకున్నా ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు ఇచ్చిందని, భారీ ఎత్తిపోతల పథకాలకు కరెంట్ ఎక్కడి నుంచి తెస్తారో స్పష్టత లేదని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 250 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. భారీ ఎత్తిపోతల పథకాలు పూర్తయితే వాటికే 210 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరముంటుంది. దీనిపై ప్రభుత్వానికి స్పష్టత లేదని పేర్కొంది. జలయజ్ఞంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 9,19,411 ఎకరాల భూమి అవసరం కాగా ఇప్పటి వరకూ 5,97,102 ఎకరాల భూసేకరణ మాత్రమే పూర్తయింది. నిర్వాసితులకు పునారావాసం సరిగా లేదు. పైపెచ్చు పలు ప్రాజెక్టులకు ఇప్పటి వరకూ వివిధ శాఖల అనుమతే లేదు. ఫలితంగా 78.22 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించాలనే లక్ష్యం 10.63 లక్షల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. సర్కారులోని పలువురు వ్యక్తులు జలయజ్ఞం కాంట్రాక్టర్ల నుంచి భారీగా ముడుపులు పుచ్చుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో కాగ్ నివేదిక అవినీతి మూలాలను తట్టింది. కాగ్ అక్షింతలతోనైనా రాష్ట్ర సర్కారు తీరులో మార్పు వస్తుందో లేదో వేచి చూడాలి.