కాడెద్దుల బాకీకి రైతును కట్టేశారు
– రూ.10 వేల కోసం వ్యాపారి కర్కశం
వికారాబాద్ (రంగారెడ్డి జిల్లా),ఏప్రిల్ 24(జనంసాక్షి):కాడెద్దులు కొన్న సమయంలో బాకీ ఉన్న రూ.10 వేలు ఇవ్వలేదని పశువుల వ్యాపారి ఒకరు ఓ రైతును మూడు గంటల పాటు విద్యుత్ స్తంభానికి కట్టేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పశువుల మార్కెట్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వికారాబాద్ మండలం ధన్నారం గ్రామానికి చెందిన వడ్డే యాదయ్య (38) తనకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేసేవాడు. ఈ క్రమంలో రెండేళ్ల కిందట ధారూరు మండల కేంద్రానికి చెందిన ఓ పశువుల వ్యాపారి వద్ద కాడెద్దులు కొనుగోలు చేశాడు. వీటి ధర అప్పట్లో రూ. 27 వేలు. ఇందులో రూ. 17 వేలు రెండు విడతల్లో తీర్చాడు. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యాపారికి రైతు యాదయ్య మిగిలిన రూ. 10 వేలు చెల్లించలేకపోయాడు.ఇదిలా ఉండగా.. ఆదివారం మిత్రుడి కోరిక మేరకు రైతు యాదయ్య వికారాబాద్ పశువుల సంతకు వచ్చాడు. ఈ నేపథ్యంలో సదరు వ్యాపారికి రైతు వడ్డే యాదయ్య తారసపడ్డాడు. అంతే.. మరో ఆలోచన లేకుండా రైతును తాడుతో అక్కడే ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టేశాడు. ‘రెండేళ్లుగా నీకోసమే ఎదురు చూస్తున్నా.. అప్పు తీర్చమని విూ ఇంటికి వస్తే ఇబ్బందుల పాల్జేశావు. డబ్బు ఇవ్వందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్లలేవు. నిన్ను ఎవరు విడిపిస్తారో చూస్తాం’ అంటూ హెచ్చరించాడు. కరువు పరిస్థితుల్లో తీసుకున్న అప్పు తీర్చులేకపోయానని, పనిచేసైనా అప్పు తీరుస్తానని, కొంత సమయం కావాలని రైతు వడ్డే యాదయ్య వ్యాపారిని అభ్యర్థించాడు. అయితే.. సమాచారం అందుకున్న ‘సాక్షి’ అక్కడికి చేరుకుని వ్యాపారితో మాట్లాడింది. రైతును పోలీసులకు అప్పగించాలని, లేదంటే కేసు అవుతుందని చెప్పడంతో ఎట్టకేలకు రైతును స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.