కానిస్టేబుల్ ఆశతీరకుండానే యువకుడు మృతి
ఏలూరు, జూలై 18 : పోలీసు కానిస్టేబుల్ కావాలన్న ఆశ తీరకుండానే ఒక యువకుడి నిండు ప్రాణం పోయింది. పోలీసు కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించి నిర్వహించిన ఐదుకిలో మీటర్ల పరుగు పందాలు ఈ యువకుడి ప్రాణం తీసాయి. తూర్పుగోదావరి జిల్లా మల్కీపురం ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్ ఈ నెల 11న ఏలూరులో జరిగిన ఐదు కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో పరిగెడుతూ తీవ్ర ఆస్వస్థతకు గురయ్యాడు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. బుధవారం నాడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంఘటన అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది. ఐదు కిలోమీటర్ల పరుగు పందాలు నిరుద్యోగ యువకుల ప్రాణాలు తీస్తున్నాయని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే పోలీసు శాఖలో ఉద్యోగాల కోసం ఇలాంటి పరుగుపందాల నిర్వహణ నిబంధనల కోసమేనని పోలీసు అధికారులు చెబుతున్నారు.