కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

4

-మొబైల్‌,ఇంటర్‌నెట్‌ సేవల నిలిపివేత

శ్రీనగర్‌,ఏప్రిల్‌ 16(జనంసాక్షి):జమ్ముకశ్మీర్‌లో పరిస్థితి ఇంకాకుదుట పడలేదు. శ్రీనగర్‌లో పలుచోట్ల, దక్షిణ కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో శనివారం కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. పరిస్థితులను సైన్యం పర్యవేక్షిస్తోంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలుజరక్కుండా చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం భద్రతాసిబ్బంది కాల్పుల్లో మరో వ్యక్తి మరణించడంతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. కశ్మీర్‌ లోయలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతుండడంతో శాంతి భద్రతలు కాపాడేందుకు పలు చోట్ల కర్ఫ్యూ తరహా నిబంధనలు విధించినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితులు మెరుగుపడకపోవడంతో శనివారం కూడా మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. భద్రత సిబ్బంది కాల్పుల్లో మరొకరి మృతికి నిరసనగా పలువురు వేర్పాటువాద నేతలు బంద్‌కు పిలుపునివ్వడంతో చాలా చోట్ల బంద్‌ కొనసాగుతోంది. ఇటీవల హంద్వారా ఘటనను నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం కుప్వారాలోని నట్‌నుసా ప్రాంతంలో ఆందోళనలు చేపట్టారు. భద్రత సిబ్బంది క్యాంప్‌పై దాడికి దిగడంతో ఆందోళనకారులపై భద్రతాసిబ్బంది కాల్పులు జరిపారు. ఘటనలో 18ఏళ్ల విద్యార్థి మరణించగా మరో

ముగ్గురు గాయపడ్డారు. హంద్వారాలో భద్రత సిబ్బంది బాలికను వేధించాడని వచ్చిన పుకార్లతో వందలాది ఆందోళనకారులు ఆర్మీ పోస్ట్‌పై దాడి చేయడంతో భద్రత సిబ్బంది కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ రెండు ఘటనల్లో కలిపి భద్రత సిబ్బంది కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. హంద్వారా ఘటన నుంచి కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్ని సంగతి తెలిసిందే.