కాశ్మీర్‌లో మళ్లీ పీడీపీ-భాజపా సర్కారు

4

– మోడీతో మహబూబా భేటి

న్యూఢిల్లీ,మార్చి22(జనంసాక్షి):జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ పీడీపీ నేత మెహబూబా మూప్తీ మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న వ్యవహారాలు ఆమె రాకతో ఇక ఊపందుకోనున్నాయని తెలుస్తోంది. అయితే నేరుగా సమాధానం చెప్పేందుకు నిరాకరించిన మెహబూబా గురువారం జరిగే పార్టీ శాసనసభ సమావేశం తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని  తెలిపారు. మోదీతో భేటీ అనంతరం మెహబూబా విూడియాతో మాట్లాడుతూ ప్రధానితో సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగిందని చెప్పారు. రెండు, మూడు నెలలుగా ప్రతిష్ఠంభన నెలకొందని, మోదీతో భేటీ తర్వాత చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.  గురువారం తమ పార్టీ సమావేశం జరుగుతుందని, నిర్ణయాధికారం తనకు వదిలేసిందని మెహబూబా చెప్పారు. భవిష్యత్‌ కార్యాచరణను గురువారం నిర్ణయిస్తామని ఆమె స్పష్టం చేశారు. ప్రధానితో సమావేశం అంటే అది శుభపరిణామమేనని, జమ్మూకశ్మీర్‌ ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని మెహబూబా అన్నారు. ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ మరణంతో జమ్మూ కశ్మీర్‌లో రాజకీయ ప్రతిష్ఠంభన ఏర్పడింది. పీడీపీ శాసనసభ పక్ష నేతగా మెహబూబా ముఫ్తీని ఎన్నుకున్నప్పటికీ వెంటనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేయలేదు. పొత్తు భాగస్వామి బీజేపీపై ఆమె అనేక అంశాలపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. రెండు నెలల చర్చల ద్వారా తెగతెంపులు జరిగినట్లు కూడా వర్తాలు వచ్చాయి. అయితే అన్నీ ఊహాగానాలకు తెర దించుతూ మెహబూబా ముఫ్తీ ప్రధాని మోదీని కలుసుకున్నారు. కశ్మీరు పరిణామాలు చర్చించారు. దీంతో త్వరలోనే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం కావచ్చని భావిస్తున్నారు.