కృష్ణానది నీ అబ్బ జాగీరా?

C

పోతిరెడ్డుపాడు, కండలేరు, సోమశిల, వెలుగోడు, హంద్రినీవా, వెలిగొండ ఎవన్నడిగి కట్టిన్రు?

పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్చిచేసి తీరతా

మహబూబ్‌నగర్‌ గడ్డపై కేసీఆర్‌ ఉగ్రరూపం

మహబూబ్‌ నగర్‌, జూన్‌ 11 (జనంసాక్షి): కృష్ణమ్మ నీళ్ళతో పాలమూరు జిల్లా కాళ్ళు కడుగుతానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. పాలమూరు జిల్లా నుండి కరువు రక్కసిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం కంకణబద్దంగా పని చేస్తుందని ఆయన చెప్పారు. గురువారం భూత్పూర్‌ మండలం కరివెనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. దీనికి గుర్తుగా సీఎం పైలాన్‌ ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ… కృష్ణా నది నీ అబ్బజాగీరా అని ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. సీమాంధ్రలో అకమ్రంగా నిర్మించిన పోతిరెడ్డుపాడు, కండలేరు, సోమశిల, వెలుగోడు, హంద్రినీవా, వెలిగొండ ఎవన్నడిగి కట్టిన్రని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి తీరతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పలువరు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో స్థానికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,  పాలమూరు ఎత్తిపోతల పథకానికి పనులు ప్రారంభించడం తనకెంతో సంతోషంగా ఉందని  అన్నారు. జీవితంలో మంచి పనులు చేసే అవకాశం, ప్రజల దుఖఃంలో పాలు పంచుకునే అవకాశం కొందరికే వస్తుందని తెలిపారు.  నీటిబొట్టు కోసం పరితపించిన జిల్లా పాలమూరు అని తెలిపారు. కృష్ణమ్మనీళ్ళను జిల్లాలో బిరబిరా పారిస్తానని, అందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని కేసీఆర్‌ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరు అన్యాయానికి గురైందని ఆయన అన్నారు. గతంలోఆలంపూర్‌ జోగులాంబ అమ్మవారి పాదాలకు మొక్కి  గద్వాల్‌ వరకు పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. మొండి పట్టు పడితేనే  పాలమూరుకు నీళ్ళు వస్తాయని, ప్రాజెక్టులకు ఎవడు అడ్డు వచ్చినా ఆగవని కేసీఆర్‌ అన్నారు.  కుర్చి వేసుకొని కూర్చొని ప్రాజెక్టులు కడతానని గతంలో తాను చెప్పిన విషయాన్ని కేసీఆర్‌ ఈసంధర్భంగా గుర్తు చేశారు. పాలమూరు గుట్టల్లో ఏది మంచిగుందో చూసుకొని అక్కడ గెస్టుహౌజ్‌ నిర్మించుకొని  15 రోజులకోసారి వచ్చి ప్రాజెక్టు పనులను సవిూక్షిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణం నేపధ్యంలో ముంపు ఎక్కువగా ఉండకూడదని అధికారులను ముందుగానే ఆదేశించానని ,  పాలమూరు ఎత్తిపోతల పథకంలో కేవలం మూడు తండాలు మాత్రమే నీట మునుగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. రూ.35,200 కోట్లతో ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తున్నామని చెప్పారు.  నిర్వాసితుల కడుపులు నింపాకే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రాజెక్టు కింద ముంపుకు గురయ్యే వారికి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం ప్రకటించారు. ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టు పనులు మొదలుపెడతామన్నారు. అందరికి వెంటనే ఉద్యోగాలు ఇచ్చేలా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్నామన్నారు.నిర్వాసితులకు ధర్జాగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు.  ప్రాజెక్టు పనులకు ఆటంకం కటిగించ వద్దని  ముఖ్యమంత్రి స్థానిక ప్రజాప్రతినిధులను కోరారు. ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులకు ఎటువంటి నష్టం జరగదని, అంతకంతకు లాభం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కాదని సోయగల తెలంగాణ బిడ్డల ప్రభుత్వమని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌ రావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, మహేందర్‌ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.