కేంద్రప్రభుత్వ ప్రకటనపై ఐఎంఎ అభ్యంతరం
విజయనగరం, జూలై 5 : దేశంలో లింగ నిర్ధారణ నిరోధక బిల్లుకు సవరణలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం వైద్యుల ప్రాథమిక హక్కులను సైతం భంగం కలిగేలా ప్రకటనలు జారీ చేసిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విఎస్ ప్రసాద్ ఆరోపించారు. గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ అల్ట్రాసౌండ్ సెంటర్లు ఎక్కువగా ఉండి, రేడియోలజిస్టులు తక్కువగా ఉండే దేశంలో ఒకరు రెండు సెంటర్లకంటే ఎక్కువ చోట్ల పనిచేయకూడదన్న ప్రభుత్వ నింబంధన గ్రామీణ ప్రాంత ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కల్పిస్తుందని ఆయన విమర్శించారు. లింగ నిష్పత్తిని నియంత్రించేందుకు ప్రభుత్వ చర్యలు సమంజసమే అయినప్పటికీ వైద్యులకు నియంత్రించాలని భావించడం సరికాదని అన్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలను రూ.3వేల నుంచి రూ.25 వేలకు, జెనిటిక్ లేదా నర్సింగ్ హోంలకు 4 వేల నుంచి 30 వేలకు పెంచి పేద ప్రజల నడ్డి విరిచారని ఆయన విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఆయన కోరారు.