కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలవి ప్రజా వ్యతిరేక విధానాలు
పటిష్ట ఐక్య ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం
సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి
ఖమ్మం,మార్చి08(జనంసాకి)్ష: ప్రస్థుతం అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు వ్యతిరేకంగా పటిష్టమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోడీ సర్కారు అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక, ఆర్థిక విధానాలపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు తానో ఛాయ్‌వాలా కొడుకునని చెప్పుకున్న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నేడు కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవ చేశారు. ఎన్నికలకు ముందు ధరల తగ్గింపు, విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు తీసుకురావటం తదితరాంశాలపై ప్రజలకు హావిూలనిచ్చిన మోడీ ఇప్పుడు ఆ అంశాలపై నోరు మెదపకపోవటం శోచనీయమన్నారు. బ్లాక్‌మనీకి సంబంధించి సిట్ తన నివేదికలో 15,16 మంది పేర్లను ప్రస్తావించిందని గుర్తుచేశారు. అయితే అందులో సగం మంది కాంగ్రెస్‌కు, మరో సగం మంది బిజెపికి విరాళాలు ఇచ్చారని తెలిపారు. అంటే ఈ రెండు పార్టీలూ కలిసి వారిని కాపాడుతున్నాయని ఆరోపించారు. ఆహార భద్రతా చట్టం పేరిట పేదలకిచ్చే రేషన్ కార్డుల సంఖ్యను కుదించేందుకు ప్రయత్నించటం దారుణమన్నారు. పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోకుండా దొంగచాటున, రైతులకు వెన్నుపోటు పొడిచే రీతిలో భూ సేకరణ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారని విమర్శించారు. అమెరికాతో స్నేహానికి అర్రులుచాచి ఆ దేశంలో అణు ఒప్పందం చేసుకోవటం భారతదేశానికి నష్టం, ప్రమాదకరమని హెచ్చరించారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బ్రహ్మాండమైన ఉపన్యాసాలు దంచుతున్నారని సురవరం విమర్శించారు. ‘ఆయన మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ కాళ్లు మాత్రం గడప దాటటం లేదు’ అని ఎద్దేవా చేశారు. ప్రతి దానికీ ‘బంగారు తెలంగాణ’ అంటూ మభ్యపెడుతున్న కెసిఆర్ అసలు ఆ పదానికి అర్థమేంటో చెప్పాలని ప్రశ్నించారు. కావాల్సింది బంగారు తెలంగాణ కాదు..పచ్చని తెలంగాణ, ప్రజా తెలంగాణ అని చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారంపై మారుమాట్లాడని ముఖ్యమంత్రి, వాస్తు బాగా లేదనే పేరిట సచివాలయాన్ని తరలించేందుకోసం రూ.150 కోట్లు కేటాయించటం విడ్డూరంగా ఉందన్నారు. ఇలాంటి అర్థం, పర్ధం లేని పనులతో, మాటలతో ఎక్కువకాలం ప్రజల్ని మభ్యపెట్టలేరని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రజల్ని, ప్రజా సమస్యల్ని పట్టించుకోవాలని కెసిఆర్‌కు హితవు పలికారు. ఇక విూదట సిపిఐ, సిపిఎంతోపాటు ఇతర వామపక్షాలన్నీ కలిసి ముందకు సాగాలని, తద్వారా ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయం చూపాలని సురవరుం పిలుపునిచ్చారు.