కేటీఆర్‌, డీకేఅరుణ వాగ్వివాదం

3B

సీఎం సూచనతో ఇరువురి విచారం

ౖహౖాెదరాబాద్‌,మార్చి10(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యంతో సభలో దుమారం రేపిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారం ముగిసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతుండగా అధికారపక్ష ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. దీంతో అసహనానికి గురైన అరుణ నోరు మూసుకో అంటూ అదికారపక్ష ఎమ్మెల్యేలపై స్వరం పెంచారు. ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. చివరకు 15 నిమిషాలపాటు సభము వాయిదా వేసి అరుణ వ్యాఖ్యల ఫుటేజీని పరిశీలించిన స్పీకర్‌ క్షమాపణ చెప్పాలని కోరారు. నేరుగా క్షమాపణలు చెప్పడం ఇష్టం లేని మాజీమంత్రి డికె అరుణ తానెందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓ దశలో ఇక ఈ విషయాన్ని వదిలివేస్తున్నట్లు స్పీకర్‌ మధుసూధనాచారి ప్రకటించారు. అయితే బిజెపి పక్ష సభ్యుడు లక్ష్మణ్‌ లేచి ఇది పద్దతి కాదన్నారు. దీంతో మళ్లీ అరుణ మాట్లాడుతూ మహిళా సభ్యురాలి పట్ల అసభ్యంగా మాట్లాడటం సమంజసమా అని ప్రశ్నించారు. తెలంగాణ శాసనసభలో డీకే అరుణ మాట్లాడుతూ…. సభాసంప్రదాయాలు అధికారపక్షానికి ఒకలా… ప్రతిపక్షాలకు మరోలా ఉండవన్నారు.  శాసనసభలో ఏదో ఒక సమయంలో ఎవరైనా స్లిప్‌ కావడం పరిపాటి.. దానికి ఒక పదంలో విత్‌డ్రా చేసుకుంటున్నాను అని చెబితే సరిపోతది అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. క్షమాపణ చెప్పేందుకు కూడా రాద్ధాంతమా అని ప్రశ్నించారు. బేషజాలు పక్కనపెట్టి క్షమాపణ చెప్పాలని సీఎం సూచించారు. తమకు ఎలాంటి బేషజాలు లేవు.. తమ మంత్రి క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని సీఎం స్పష్టం చేశారు. సభలో విలువైన సమయం వృథా అయి పోతోంది. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చించాలి. ఇదేనా సభలో చర్చ అంటే అని ప్రశ్నించారు. చర్చ ప్రజాసమస్యలపై ఫలవంతంగా జరగాలి. మంచి పనులు చేయాలి. ప్రజలకు గుర్తుండిపోయేలా కార్యక్రమాలు చేయాలని సీఎం సూచించారు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడుకుని సభా సమయాన్ని వృథా చేయొద్దని సూచించారు. అయితే తానే ఎందుకు ముందు క్షమాపణలు చెప్పాలన్నారు. దీంతో సిఎం అధికార పక్ష సభ్యులే చెబతుతారని అనగా కెటిఆర్‌ లేచి క్షమాపణలు చెప్పారు. అంతకు ముందు అరుణ వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఖండించారు. అరుణ వ్యాఖ్యలు చూసి మహిళలు సిగ్గుపడుతున్నారని అన్నానని అన్నారు. తాను మహిళలను కించపరిచేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. డీకే అరుణ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సభను తప్పుదోవ పట్టించేందుకు అరుణ యత్నిస్తున్నారని తెలిపారు. మైక్‌లు విరగొట్టడం సంప్రదాయమా అని ప్రశ్నించారు. ఇందుకు ప్రతిస్పందించిన డీకే అరుణ.. మైక్‌లు విరగ్గొడితే మహిళా లోకానికి సిగ్గు చేటు అవుతుందా అని అడిగారు. ఇందుకు శ్రీహరి స్పందిస్తూ.. మైక్‌లు విరగొట్టండి.. బెంచీలు ఎక్కండి.. ఇదేనా సభా సంప్రదాయం అని ప్రశ్నించారు. డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకానికి సిగ్గుచేటు అని మాత్రమే వ్యాఖ్యానించానని స్పష్టం చేశారు.’నేను అసభ్య పదాలు వాడానని అన్నారు… అవెందుకు మాట్లాడానో చూడాలి’. సభలో మొదట పొరపాటు ఎక్కడ మొదలైందో గుర్తించాలన్నారు. రన్నింగ్‌ కామెంట్రీ బంద్‌ చేయించాలని సీఎంను కోరారు. చివరకు  ప్రశ్నోత్తరాల సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం సభలో టీఆర్‌ఎస్‌ సభ్యుడిని నోరు మూసుకో అన్నందుకు క్షమాపణ కోరుతున్నానని అరుణ పేర్కొన్నారు. క్షమాపణ చెప్పేందుకు అరుణ సభలో కాసేపు విసిగించారు. మంత్రి కేటీఆర్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని తెలిపిన తర్వాతే అరుణ క్షమాపణ చెప్పారు. అరుణ క్షమాపణలు చెప్పడం కూడా ఆగ్రహంతోనే చెప్పారు. ఇకముందు సభలో ఎవరైనా నోరు మూసుకో అంటే వారంతా క్షమాపణలు చెప్పాల్సిందే అని కండిషన్‌ పెట్టారు. మొత్తంగా ఈ వ్యవహారం సద్దుమణగడంతో గవర్నర్‌ ప్రసంగంపై జీవన్‌ రెడ్డి చర్చను మొదలు పెట్టారు.