కేబినెట్‌లో దళితులు, మహిళలు లేరు

 

8 9

చరిత్రలో ఇదే మొదటిసారి.. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

బాద్యతలు స్వీకరించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌,మార్చి08(జనంసాక్షి): తెలంగాణ కేబినెట్‌లో దళితులు, మహిళలు లేకపోవడం సిగ్గుచేటని, ఇది ఒక కేసీఆర్‌ ప్రభుత్వానికే చెల్లిందని టీ కాంగ్రెస్‌ చీఫ్‌ ఉత్తమ్‌  కుమార్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్‌ పాస్‌ పటిష్ఠ పరచడమే తన లక్ష్యమని టీపీసీసీ నూతన అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో టీఆర్‌ఎస్‌ పాత్ర ఏమాత్రం లేదన్నారు. కేసీఆర్‌ తన మంత్రివర్గంలో దళితులు, మహిళలకు స్థానం కల్పించలేదని, టీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేల్లో ఒక్కరికి కూడా మంత్రి పదవి చేపట్టే అర్హత లేదా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ తొలి కేబినెట్‌లో ఒకే కుటుంబం, ఒకే కులం ఉందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలో తుగ్లక్‌ పాలన సాగుతోందన్న ఉత్తమ్‌ కేసీఆర్‌ ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన హావిూలను గాలికొదిలేశారని విమర్శించారు. అనుభవ లేమితో అడ్డదిడ్డమైన పాలన సాగిస్తున్నారని, హైకోర్టు మొట్టికాయలతో ఫాస్ట్‌ పథకాన్ని ఉపసంహరించుకున్నారని ఆయన ఉదహరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమరుల కుటుంబాలకు అన్యాయం చేస్తోందని ఉత్తమ్‌ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని లేకుండా చేయాలనే కేసీఆర్‌ లక్ష్యం నెరవేరదని, ఆయన తుపాకీ చప్పుళ్లకు కాంగ్రెస్‌ కార్యకర్తలు భయపడరని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ తలచుకోకుంటే కేసీఆర్‌ తలకిందులుగా తపస్సు చేసినా తెలంగాణ వచ్చేది కాదన్నారు. మరో రెండు నెలల్లో కాంగ్రెస్‌లోకి కొత్త రక్తాన్ని తీసుకొస్తామని, యువతకు పార్టీలో పెద్దపీట వేస్తామని టీపీసీసీ చీఫ్‌ చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మోసపూరిత హావిూలిచ్చి అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్‌ పార్టీ నూతన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణను సాధిస్తే, అది ఇప్పుడు ఒక కుటుంబం గుప్పిట్లో నలిగిపోతోందని అన్నారు. తెలంగాణ ఒక కుటుంబం కోసం కాదని, 4 కోట్ల ప్రజల కోసం ఏర్పడిందన్నారు. ఆరు దశాబ్దాల తెలంగాణ కలను సోనియా గాంధీ సాకారం చేశారని ఆయన గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంపై కేసీఆర్‌కు నమ్మకం లేదని, ఆయన వైఖరితో తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని లేకుండా చెయ్యాలన్న ఏకైక ఎజెండాతో కేసీఆర్‌ ముందుకెళ్తున్నారని భట్టి దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీని ఎవ్వరూ.. ఏవిూ చేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందరినీ కలుపుకొని అభివృద్ధిలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటేనని ఉద్ఘాటించారు. సామ్రాజ్యవాద శక్తులకంటే మతతత్వ శక్తులు భయంకరమైనవని, మత ఛాందసవాదులే మహాత్మా గాంధీని పొట్టనబెట్టుకున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.