కేసులతో విద్యార్థుల గొంతు నొక్కలేరు

1
– వేముల రోహిత్‌ నాకు ఆదర్శం

– జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ

రోహిత్‌ నాకు ఆదర్శం: కన్నయ్య

న్యూఢిల్లీ,మార్చి4(జనంసాక్షి):  అఫ్జల్‌గురు తనకు ఆదర్శం కాదని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ వేములని తాను ఆదర్శంగా తీసుకుంటానని జేఎన్‌యూ విద్యార్థి నేత కన్నయ్య కుమార్‌ అన్నారు. శుక్రవారం దిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు ఆరోపిస్తున్నట్లు తాను జాతి వ్యతిరేకిని కాదని, భారతమాత బిడ్డనని అన్నారు. పేదరికం నుంచి, అవినీతి నుంచి తాము విముక్తిని కోరుకుంటున్నామన్నారు. దేశ ద్రోహం కేసులతో విద్యార్థుల గొంతు నొక్కలేరని ధ్వజమెత్తారు.అఫ్జల్‌ గురు భారతీయుడని, అయితే ఆ విషయంలో ఏం జరిగినా అది చట్టప్రకారమే జరిగిందని చెప్పారు. తనకు రాజ్యాంగంపై పూర్తి నమ్మకముందన్నారు. జేఎన్‌యూ ర్యాలీలో ఏం జరిగిందన్నదానిపై వీడియోలే బయటపెట్టాయని, వీడియోలపై వచ్చిన ల్యాబ్‌ రిపోర్టులో జాతి వ్యతిరేక నినాదాలుగాని, హింస జరిగినట్లుగాని ఎక్కడా ఆధారాలు లేవని తెలిపారు. ఇదిలావుంటే ఐదు రాష్టాల్ల్రో ఎన్నికల నగారా మోగడంతో ఆయా పార్టీలు అప్పుడే అభ్యర్ధులను ప్రకటించడమనే పనిలో మునిగిపోయాయి. మరికొన్ని పార్టీలు ఎవరితో ప్రచారం చేయించాలనే విషయంపై కూడా యోచన చేస్తున్నాయి. ఢిల్లీ జెఎన్‌యూ విద్యార్ధి సంఘం నాయకుడు కన్నయ్య వామపక్షాల తరపున పశ్చిమబెంగాల్‌, కేరళలో ప్రచారం చేస్తాడని తెలుస్తోంది. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, మోదీలకు వ్యతిరేకంగా గట్టిగా యువవాణి వినిపిస్తుండటంతో కన్నయ్యతో ప్రచారం చేయించాలని వామపక్షాలు నిర్ణయించాయి. రెండు రాష్ట్రాల్లోనూ వామపక్షాలు అధికారంలో లేవు. రెండు రాష్ట్రాల్లో నూ వామపక్షాలు ప్రస్తుతానికి ప్రతిపక్షంగా ఉన్నాయి. కన్నయ్యకు దేశవ్యాప్తంగా ప్రచారం రావడంతో పాటు అద్భుతంగా మాట్లాడి ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తుండటంతో సిపిఎం, సిపిఐ ఆయన నాయకత్వం కోసం పోటీపడుతున్నాయి. ఇప్పటికే అరవింద్‌ కేజ్రీవాల్‌,రాహుల్‌ గాంధీ,  నితీశ్‌ కుమార్‌ కన్నయ్యను ప్రశంసల్లో ముంచెత్తారు. కన్నయ్యతో ప్రచారం చేయిస్తే తమకు కలిసివస్తుందని వామపక్షాలు గంపెడాశలు పెట్టుకున్నాయి.