కొత్త జిల్లాలతో పెరగనున్న ఉపాధి అవకాశాలు

రాష్ట్రంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హావిూమేరకుకొత్త జిల్లాల ఏర్పాటు సంకల్పం రాస్ట అవతరణ దినోత్సవం సందర్భంగా సాకారం కానున్నది. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు పెరగడం వల్ల ఓ రకంగా కొత్తగా ఉద్యోగాల కల్పన జరుగనుంది. దీంతో మరిన్ని అవకాశాలు పెరుగుతాయి. ప్రత్యక్షంగా ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం ఉన్నా పరోక్షంగా అనేక విధాలుగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇది నిరుద్యోగులకు వరం కానుంది. జిరాక్స్‌ సెంటర్లు మొదలుకుని, డిటిపి సెంటర్లు, దస్తావేజుల అమ్మకాలు, తదితరరంగాలకు అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులు స్వయం ఉపాధి పెంచుకునే వీలు కలుగుతుంది. సిఎం కెసిఆర్‌ ముందునుంచి చెబుతున్నట్లుగా,  రాష్ట్ర ప్రజలు ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న కొత్త జిల్లాల ఏర్పాటు పక్రియ కల సాకారం కానుంది. దీంతో పరిపాలన వికేంద్రీకరణ జరుగనుంది. అంతేగాకుండా ప్రజలకు  క్షేత్రస్థాయిలో పాలన మరింత చేరువగా అందించే దిశగా ప్రయత్నం జరుగనుంది. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు అదనంగా 14 లేదా 15 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేస్తామని  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందునుంచి చెబుతూనే ఉన్నారు.  ఈ కొత్త జిల్లాలను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2న ప్రకటిస్తామని చెప్పారు. దీనితో కొత్త, పాత జిల్లాలు కలుపుకొని తెలంగాణలో జిల్లాల సంఖ్య 24 లేదా 25కు పెరుగుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15 నుంచి, లేదా దసరా పండుగ నుంచి అధికారిక కార్యక్రమాలు చేపడతారని సీఎం అన్నారు. కొత్త జిల్లాలతో పాటు మరో 40 మండలాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మండలాలను పునర్వ్యవస్థీకరించాలని అధికారులకు చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత కొత్త జిల్లాల ఏర్పాటు కోసం డిమాండ్‌ పెరిగింది.  ప్రతిచోటా తమకో జిల్లా కావాలన్న ఆందోళనలు కొనసాగాయి. తరవాత సిఎం వారికి హావిూ ఇవ్వడంతో ఎక్కడిక్కడ ఆందోళనలు సద్దుమణిగాయి. ఏ మేరకు ఇవి ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం ఇంతకాలం పరిశీలించిది.  దీనికోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ నేతృత్వంలో కమిటీ అధ్యయనం చేసింది.  వీలైనంత త్వరగా నివేదిక అందించాలని కమిటీకి ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఇప్పుడు నివేదిక ఆధారంగా సిఎం కెసిఆర్‌ జిల్లాల ఏర్పాటుకు ముందుకు వచ్చారు.

కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు సంబంధించి తక్షణమే కార్యాచరణను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించారు.  నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోతున్న నేపథ్యంలో జిల్లాలు కూడా చిన్నవిగా ఉంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు సుపరిపాలన అందించవచ్చన్నది సిఎం కెసిఆర్‌ అభిప్రాయంగా ఉంది. అధికారులు  ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించడం, ప్రభుత్వ పథకాలను చేరవేయడంద్వారా బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని సీఎం భావిస్తున్నారు. నిజానికి మండల వ్యవస్థ వచ్చిన తరవాత పాలన వికేంద్రీకరణ జరిగింది. ఇప్పుడు జిల్లాలు పెరిగితే అది మరింత చేరువ కానుంది. మనకన్నా చిన్నగా ఉన్నకేరళ తదితర రాస్ట్రాల్లో జిల్లాల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పుడు జిల్లాలు, మండలాల పెంపు మరో చారిత్రక ఘట్టంగా నిలువనుంది. మరోవైపు  పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగనుంది. అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలు ఏర్పా టు చేస్తామని ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన హావిూ మేరకు పునర్వ్యవస్థీకరణ చట్టానికి లోబడే జిల్లాలను క్రమబద్ధీకరించనున్నారు. జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా పరిపాలన సౌలభ్యంకోసం ఆయా శాఖల్లో అధికారుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి 8-10 మండలాలకు ఒక రెవెన్యూ డివిజినల్‌ అధికారిని ప్రభుత్వం నియమిస్తుంది. జిల్లాల సంఖ్య ఎక్కువ ఉంటే కేంద్రంనుంచి అందే ప్రయోజనాలను తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో పొందే అవకాశం ఉంటుంది. కేంద్రం కూడా జిల్లాల ఆధారంగా నిధులు విడుదల చేస్తుంది. నిత్యం ప్రజలతో సంబంధాలుండే రెవెన్యూ, న్యాయ, మున్సిపల్‌, విద్య, వైద్యం తదితర ముఖ్య కార్యాలయాలన్నీ జిల్లా కేంద్రాల్లోనే కేంద్రీకృతమై ఉంటాయి.  జిల్లాలు పెద్దవిగా ఉంటే ప్రజలకు అందుబాటులో లేకుండా మూరుమూల ప్రాంతాల ప్రజలకు అసౌకర్యం కలుగుతున్నదని సీఎం కేసీఆర్‌ విశ్లేషించారు. భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి అంతా ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వికేంద్రీకరించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ ముందునుంచి చెబుతున్నారు.  హైదరాబాద్‌కు దగ్గరలో ఉండి, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పలు పట్టణాలను జిల్లా కేంద్రాలుగా తీర్చిదిద్దడంద్వారా వికేంద్రీకరణ సాధ్యపడుతుంది.  తెలంగాణకంటే తక్కువ విస్తీర్ణం అతి తక్కువ జనాభా కలిగిన పలు రాష్టాల్ల్రో ఎక్కువ సంఖ్యలో జిల్లాలున్నాయి.  క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని,ప్రజలే కేంద్రంగా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జిల్లాల ఏర్పాటు జరగాలని సీఎం అధికారులను ఆదేశించారు.  ఆదిలాబాద్‌ మొదలు పాలమూరు వరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు డిమాండ్‌లు ఉన్నాయి. 10 లక్షల నుంచి 15 లక్షల జనాభాకు ఒక జిల్లాను ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో హావిూ ఇచ్చింది. ఈ మేరకు మరో 15 జిల్లాలు ఏర్పడితే అధికారుల సంఖ్య కూడా ఆమేరకు పెరిగి ప్రజల ముంగిటకు పాలన సమకూరుతుంది. నిదురద్యోగులకు ఇది వరం కానుంది.