కొనకనమిట్లలో పౌష్టికాహారంపై అవగాహన ర్యాలీ
కొనకనమిట్ల , జూలై 26 : మండల కేంద్రమైన కొనకనమిట్లలో మహిళా శిశు చైతన్య సదస్సుల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పోషకాహార అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం రామచంద్రయ్య ప్రారంభించారు. కిశోర బాలికలు మండలంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అన్ని ప్రధాన వీధుల గుండా సాగి ఎంపిడివో కార్యాలయం వరకు చేరుకుంది. ఎంపిడివో కార్యాలయం ఎదుట మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపిల్లలను ఆటలాడే వయసులోని ఆలీగా చేయవద్దు, వారి చిన్నతనాన్ని చిక్కుల్లోకి కుచ్చొద్దు, ఆడ పిల్లల సాధికారిత భారతమాతకు మణిహారం ఏడాది బిడ్డకు తల్లి ఆహారంలో సగమివ్వాలి. మహిళలపై అత్యాచారాలను ఖండిద్దాం, మహిళలపై యాసిడ్ దాడులను ఖండిద్దామంటూ పెద్ద ఎత్తుననినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఎస్ నూర్జహాన్‌బేగం, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు కె రాంసుబ్బులు, ఎస్‌కె సైదాబి, లతీఫ్‌బిబి, అరుణాదేవి, హెచ్‌ఎం రామచంద్రయ్య, వ్యాయామా ఉపాధ్యాయులు సుబ్బారావు, కిశోర బాలికలు పాల్గొన్నారు.