కొనసాగుతున్న సీపీఎం ఆందోళనలు రాష్ట్రంలో పలు చోట్ల అరెస్టులు, లాఠీచార్జీలు

హైదరాబాద్‌,డిసెంబర్‌ 11 (జనంసాక్షి): ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఎం రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు మంగళవారం ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మధు నేతృత్వంలో కార్మికులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కార్యాలయంలోకి చొచ్చుకువెళ్ళేందుకు ప్రయత్నించిన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడడంలో జిహెచ్‌ఎంసీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పార్కులు కబ్జాదారుల చేతుల్లోకి పోతున్నాయని ఆరోపించారు. 60గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వలేని ప్రభుత్వం వేలాది ఎకరాలుమాత్రం కార్పోరేట్‌ సంస్థలకు అంటగడుతోందని విమర్శించారు.  ప్రత్యేక ఆర్థిక మండలుల పేరుతో ప్రభుత్వం వేలాది ఎకరాలను కంపెనీలకు ధారాదత్తం చేస్తుందని మండిపడ్డారు. అయినా ఆ భూముల్లో ఎలాంటి పరిశ్రమలు నెలకొల్పలేదని విమర్శించారు. అట్టి భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకుని పేదలకు పంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా జంటనగరాల్లో నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు బాధలు పడుతున్నారని అన్నారు. ఇందులో భాగంగా గ్యాస్‌ సబ్సీడీ సిలిండర్లను తగ్గించి ప్రభుత్వం ప్రజలపై మరింత భారం మోపిందని విమర్శించారు. ఇంటిపన్నులను, వాటర్‌ పన్నులను పెంచి ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు.

విద్యుత్‌ సర్‌చార్జీ పేరుతో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని ఆరోపించారు. వర్షాలు పుష్కలంగా కురిసినా విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు తమ పదవులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా డెంగీ వ్యాధి వ్యాప్తి చెందిన ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్దమయ్యారని ఆయన అన్నారు. రాష్ట్రం విభజన అంశాన్ని లేవనెత్తి చిచ్చు పెట్టిన ప్రభుత్వం పరిష్కారాన్ని మాత్రం చూపలేదకపోతోందని, దీంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిచో ప్రజాగ్రాహానికి గురికాక తప్పదని మధు హెచ్చరించారు.