పల్లెలో వాడిన కమలం
` 3911 స్థానాల్లో గెలిచింది 6.5 శాతం
` కేవలం 236 స్థానాల్లోనే విజయం
` రెండు, మూడు జిల్లాల్లోనే ప్రభావం
` తక్కువ స్థానాలతో బీజేపీకి ఘోర పరాభవం
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ పంచాయతీ పోరులో కమలం వాడిపోయింది. తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు, మరో 8 మంది ఎంపిలు ఉన్న బిజెపి పల్లెల్లో మాత్రం పట్టుకోల్పోయింది. గ్రామ పంచాయతీలకు జరిగిన రెండు విడతల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన సీట్లలో కనీసం సగం కూడా సాధించలేక ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నది. తొలి విడతలో దారుణంగా ఓటమిపాలైన బిజెపి కేవలం 189 పంచాయతీల్లో గెలుపొందింది. రెండో విడతలోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు జరిగిన 3,911 స్థానాల్లో కేవలం 236 స్థానాల్లో (6.5 శాతం) మాత్రమే బిజెపి మద్దతుదారులు విజయం సాధించగలిగారు.ఆదిలాబాద్, మంచిర్యాల మినహా మిగిలిన ఏ జిల్లాలోనూ బిజెపి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. రెండు విడతల్లో ఆ పార్టీ కేవలం 435 స్థానాలతో సరిపెట్టుకున్నది. రెండు విడతల్లో స్వతంత్ర అభ్యర్థులు 1,161 స్థానాల్లో గెలుపొందారు. అందులో సగం కూడా బిజెపి కి రాకపోవడం కమలనాథుల దయనీయస్థితికి అద్దంపడుతున్నది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నియోజకవర్గమైన కరీంనగర్‌తోపాటు ఎంపి ఈటల గతంలో ప్రాతినిథ్యం వహించిన హుజూరాబాద్‌లోనూ బిజెపి మద్దతుదారులు ఓటమిపాలవడం చర్చనీయాంశమైంది. మరో ఎంపి రఘునందన్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న మెదక్‌లో కనీసపోటీ ఇవ్వక పోవడంతో బిజెపి ఉనికి ప్రశ్నార్థకమైంది. బిఆర్‌ఎస్ పని అయిపోయిందని, ప్రత్యామ్నాయం తామేనని ఊదరగొట్టే బిజెపి రాష్ట్ర నేతల మాటలు కేవలం వట్టివేనని రెండు విడతల పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఖరారయిపోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి 30 శాతానికిపైగా ఓట్లు సాధించడం, 8 సీట్లలో గెలుపొందడం గాలివాటమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మున్ముందు తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం నామమాత్రమేని పేర్కొంటున్నారు.


