మరో వివాదంలో నితీశ్‌

` మహిళ హిజాబ్‌ లాగిన బీహార్‌ సీఎం
` సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో ఘటన
` ఇది ఆయన మానసిక చర్యను తెలియజేస్తోంది
` కాంగ్రెస్‌, ఆర్జేడీ విమర్శలు
పట్నా(జనంసాక్షి): బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పట్నాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఓ మహిళ హిజాబ్‌ను లాగారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇది ఆయన మానసిక చర్యను తెలియజేస్తోందంటూ కాంగ్రెస్‌, ఆర్జేడీ విమర్శలు గుప్పిస్తున్నాయి. పట్నాలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఓ వైద్యురాలికి ఆయుష్‌ సర్టిఫికెట్‌ను నీతీశ్‌ తన చేతులమీదుగా అందజేశారు. సర్టిఫికెట్‌ను చేతికిచ్చిన ఆయన.. డాక్టర్‌ ముఖంపై ఉన్న హిజాబ్‌ను కొంతమేర తొలగించారు. సీఎం చర్యకు మహిళ స్పందించనప్పటికీ.. నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయారు. అదే స్టేజీపై ఉన్న కొందరు నవ్వుతూ కనిపించారు. అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌధరి మాత్రం సీఎంను ఆపే ప్రయత్నం చేయడం వీడియోలో కనిపించింది. సీఎం చర్యను కాంగ్రెస్‌ తీవ్రస్థాయిలో దుయ్యబట్టింది. నీతీశ్‌కు పూర్తిగా మతిభ్రమించినట్లు ఉందంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడిరది. సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. మహిళల పట్ల జేడీయూ- భాజపా సంకీర్ణ ప్రభుత్వ వైఖరి ఏంటో ఈ ఉదంతం తెలియజేస్తోందంటూ ఆర్జేడీ అధికార ప్రతినిధి ఎజాజ్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. బిహార్‌ ఎన్నికల సమయంలోనూ నీతీశ్‌ ఇలానే.. ఓ మహిళ మెడలో పూలదండ వేయడం వివాదాస్పదమైంది. దీంతో ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదంటూ విమర్శలు ఎక్కుపెట్టాయి.