కొలువుదీరిన వరంగల్,ఖమ్మం కార్పోరేషన్లు
వరంగల్,మార్చి15(జనంసాక్షి):కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కొలువుదీరింది. మేయర్‌గా నన్నపునేని నరేందర్, డిప్యూటీ మేయర్‌గా సిరాజుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్‌గా నరేందర్, డిప్యూటీ మేయర్‌గా సిరాజుద్దీన్, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్‌రావుతో పాటు జిల్లా టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్‌లో 58 డివిజన్లకు గానూ 44 డివిజన్లలో టీఆర్‌ఎస్ గెలుపొందిన విషయం విదితమే. నరేందర్ 19వ డివిజన్ నుంచి పోటీ చేసి 881 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిరాజుద్దీన్ 41వ డివిజన్ నుంచి బరిలో నిలిచి గెలిచారు.ఇదిలావుంటే తనకు వరంగల్ నగర మేయర్‌గా సేవలు చేసే భాగ్యం కల్పించినందుకు కొత్తగా మేయర్‌గా ఎన్నికైన నన్నపనేని నరేందర్ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యావాదాలు తెలిపారు. గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు.
వరంగల్ అభివృద్దిపైళి సీఎం ప్రత్యేక శ్రద్ద : కడియం
వరంగల్ నగర మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సహకరించిన కార్పొరేషన్ సభ్యులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత ఆయన మాట్లాడారు. వరంగల్ నగరాభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. నగరంలో ప్రధానంగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు టీఆర్‌ఎస్ వైపే ఉంటున్నారని, పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారని ఆయన అన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జిల్లా ప్రజలు సీఎం కేసీఆర్ వెంట ఉండి టీఆర్‌ఎస్‌ను గెలిపించారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనపట్ల ప్రజలకు ప్రత్యేక అభిమానం ఉందని వెల్లడించారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఉద్యమకారులకు పెద్దపీఠ వేశారని అన్నారు. మేయర్‌గా నన్నపనేని నరేందర్‌కు, డిప్యూటీ మేయర్‌గా సిరాజుద్దీన్‌కు అవకాశం కల్పించారని తెలిపారు. వరంగల్ నగరాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రతీ యేడాది రూ.300 కోట్లు కేటాయిస్తున్నారని మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు.
కొలువుదీరిన ఖమ్మం కార్పోరేషన్ నూతన పాలకవర్గం
ఖమ్మం కార్పొరేషన్ నూతన పాలకవర్గం మంగళవారం ఉదయం కొలువుదీరింది. మేయర్ గా డాక్టర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ గా బత్తుల మురళీ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లను రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అభినందించారు.అయితే మేయర్ ఎన్నికపై టీఆర్‌ఎస్ కార్పొరేటర్ రామ్మూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నిక జరిగే వరకు రామ్మూర్తిని టూటౌన్ పీఎస్ నిర్బంధించినట్టు తెలుస్తోంది. మేయర, డిప్యూటీ ఎన్నిక తర్వాతే కార్పొరేటర్‌గా రామ్మూర్తి చేత ప్రమాణం స్వీకారం చేయించారు.కాగా సోమవారం రాత్రి వరకు కూడా మేయర్, డిప్యూటీ మేయర్ల విషయమై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. సీల్డ్ కవర్లోనే మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లను ఉంచి ఎన్నిక సమయంలోనే అభ్యర్థలను ప్రకటించారు. డిప్యూటీ మేయర్ పదవికి విపరీతమైన పోటీ నెలకొంది. ఎక్కువ సంఖ్యలో ఆశావహులు ఈ పదవి కోసం పోటీ పడ్డారు.