కోట్లకు పడగెత్తిన పాక్‌ ప్రధాని నవాజ్‌

1

ఇస్లామాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు విదేశాల్లో ఆస్తులు లేకున్నా బ్రిటన్‌లో స్థిరపడ్డ ఆయన కుమారుడు హుస్సేన్‌ నవాజ్‌ నుంచి మాత్రం షరీఫ్‌కు భారీ మొత్తంలో డబ్బు అందుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నేతల ఆస్తుల వివరాలపై ఆ దేశ ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రకటనలో ఈ విషయం స్పష్టమైంది. అయితే ఇటీవల పనామా పత్రాల్లో వెల్లడైన డాక్యుమెంట్లలో పాక్‌ ప్రధాని షరీఫ్‌కు విదేశీ ఆఫ్‌షోర్‌ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నట్లు బయటపడ్డ విషయం తెలిసిందే.  ఎన్నికల సంఘం డేటా ప్రకారం ప్రధాని షరీఫ్‌కు సుమారు రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నాయి. గత నాలుగేళ్లలో ఆయన ఆస్తులు నాలుగు రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. 2011లో షరీఫ్‌ ఆస్తులు సుమారు రూ.165 మిలియన్లు ఉండేది. 2012లో అది రూ.261.6 మిలియన్లకు చేరుకుంది. ఆ తర్వాత 2013లో ఆ మొత్తం రూ.1.82 బిలియన్లకు చేరుకుంది. ఆ తర్వాత 2014లో ఆయన ఆస్తులు రూ.2 బిలియన్లు దాటినట్లు తెలుస్తోంది. హుస్సేన్‌ నవాజ్‌ నుంచి 2015లో షరీఫ్‌ మొత్తం రూ.215 మిలియన్లు స్వీకరించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్థాన్‌లో బిలియనీర్లుగా అవతరించిన రాజకీయవేత్తల్లో షరీఫ్‌తో పాటు పెట్రోలియం శాఖ మంత్రి సాహిద్‌ ఖాకన్‌ అబ్బాసి, మరో నేత ఖయ్యాల్‌ జమాన్‌, సజిద్‌ హుస్సేన్‌ తోరిలు ఉన్నారు.పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు టోయోటో లాండ్‌ క్రూయిజర్‌ కారు ఉంది. దాన్ని ఓ వ్యక్తి గిఫ్ట్‌గా ఇచ్చారు. షరీఫ్‌కు మరో రెండు మెర్సిడీజ్‌ కార్లు కూడా ఉన్నాయి. అతను తన తల్లి ఇంట్లో నివాసం ఉంటున్నారు. దేశ, విదేశాల్లో బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయి. భారీ మొత్తంలో వ్యవసాయ భూములున్నాయి. షుగర్‌, టెక్స్‌టైల్‌, పేపర్‌ మిళ్లుల్లో పెట్టుబడులున్నాయి. రూ.20 లక్షలు విలువ చేసే జంతువులు, పక్షులు కూడా ఉన్నట్లు షరీఫ్‌ తన డిక్లరేషన్‌లో తెలిపారు. షరీఫ్‌ భార్య కుల్సూమ్‌ నవాజ్‌కు అబాతాబాద్‌లో భూమి, ఇల్లు ఉన్నాయి.