కోల్‌గేట్‌లో 2.25 కోట్ల దాసరి ఆస్థుల అటాచ్‌మెంట్‌

6

న్యూఢిల్లీ,మార్చి30(జనంసాక్షి): కోల్‌గేట్‌ స్కాం కేసులో ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుకు చెందిన రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసింది. దాసరి 2004-2006లో తొలిసారి, 2006-2008 వరకూ రెండోసారి బొగ్గు, గనుల

శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.  జిందాల్‌ గ్రూప్‌కు చెందిన ఎన్‌డీ ఎగ్జిమ్‌ నుంచి దాసరికి చెందిన సౌభాగ్య విూడియాలోకి రూ.2.25 కోట్లు వచ్చాయి. ఈ నిధులు మనీ లాండరింగ్‌ ద్వారా ప్రవేశించినట్టు ఈడీ భావిస్తోంది. మనీ ల్యాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద గత ఏడాది డిసెంబర్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  అధికారులు

దాసరిని దాదాపు ఆరు గంటలసేపు విచారించారు. అంతకు ముందు సీఐడీ అధికారులు కూడా ఆయనను విచారించారు.  సదరు సంస్థకు తాను 2008-11 వరకూ డెరైక్టర్‌గా ఉన్నానని, ఆ తర్వాతే ఆ సంస్థలోకి నిధులు వచ్చాయని దాసరి ఈడీకి చెప్పినట్టు తెలిసింది. ఈడీ విచారణ ముగిసిన తరువాత దాసరి మాట్లాడుతూ ఆర్థిక అవకతవకలకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని ఖండించారు.  నిబంధనల ప్రకారమే తన శాఖ కేటాయింపులు జరిపిందని, దీనికి సంబంధించిన అన్ని ఫైళ్లను ప్రధాని కార్యాలయాని(పీఎంఓ)కి పంపగా సంబంధిత అధికారులు ఆమోదం తెలిపారని దాసరి చెప్పారు.