క్రికెట్‌ను శాసిస్తున్న అండర్‌ వరల్డ్‌ మాఫియ

క్రికెట్‌ భారత్‌లో ఒక మతం. టీవీలో క్రికెట్‌ వస్తుందంటే దేశంలోని డెబ్బైశాతానికి పైగా ప్రజలు మిగతా పనులు వదులుకొని కూర్చుండిపోతారు. నగరంలో క్రికెట్‌ మ్యాచ్‌ ఉందంటే ఆ రోజు అప్రకటిత కర్ఫ్యూను తలపిస్తుంది. రోడ్డు నిర్మానుష్యమవుతాయి. ఆఫీసులకు, పాఠశాలలకు సెలవిచ్చేస్తారు. ఏ ఇద్దరు కలిసినా క్రికెట్‌ మ్యాచ్‌ ముచ్చటే. క్రికెట్‌ భారత జాతీయ క్రీడ కాదు. కానీ అత్యధిక మంది అభిమానులను సొంతం చేసుకుంది. భారత జాతీయ క్రీడ హాకీని అధిగమించి క్రికెట్‌ అభిమానులను చూరగోనేలా చేసింది భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ). ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆటను చూసే అవకాశం ఉండటం, బ్యాట్స్‌మన్‌ బంతిని విరగబాది పరుగులు సాధించడం, వేగంగా దూసుకొచ్చే ఫాస్ట్‌ బౌలింగ్‌, మెలికలు తిరిగే స్పిన్‌, వికెట్లను గిరాటేసే స్వింగ్‌, యార్కర్‌ లెంగ్త్‌ బంతులు, కళ్లు చెదిరే ఫీల్డింగ్‌ విన్యాసాలు అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయి. బీసీసీఐ క్రికెట్‌ను పెంచి పోషిస్తే, హాకీ ఇండియా జాతీయ క్రీడను పూర్తిగా విస్మరించింది. ఒలింపిక్స్‌లో వరుస స్వర్ణాలతో ప్రపంచ దేశాలకు సవాల్‌ విసిరిన భారత హాకీని దెబ్బ తీసేందుకు ప్రపంచ దేశాలు హార్డ్‌ కోర్టుల స్థానే క్లే కోర్టులు తీసుకొచ్చాయి. కృత్రిమమైన క్లే కోర్టులపై ఆడలేక భారత ఆటగాళ్లు చతికిల పడటంతో ఆటకు ఆధరణ తగ్గింది. అదే సమయంలో పుంజుకున్న క్రికెట్‌ హాకీని మరింత కోలుకోకుండా చేసింది. క్లాస్‌ గేమ్‌ పేరున్న టెస్ట్‌ క్రికెట్‌తో పాటు వన్డే ఫార్మాట్‌ ప్రవేశ పెట్టడంతో అభిమానుల ఆదరణ మరింత పెరిగింది. వన్డే ఫార్మాట్‌లో అభిమానులు ఆకట్టుకునే పలు అంశాలను చేర్చడంతో పొద్దంతా కనుల విందు దొరికే క్రికెట్‌పై మక్కువ మరింత పెరిగింది. ఫలితంగా అభివృద్ధి చెందుతున్న భారత దేశం క్రికెట్‌లోనూ మాత్రం అగ్రదేశంగా మారింది. ప్రపంచంలోనే జనాభారీత్యా రెండో అతిపెద్ద దేశమైన భారత్‌లో మార్కెట్‌ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. దీనిని క్రికెట్‌ పూర్తిగా సొమ్ము చేసుకుంది. టెన్నిస్‌, ప్రపంచ శ్రేణి అథ్లెట్లకు మాదిరిగానే క్రికెటర్లకు బ్రాండ్‌ వ్యాల్యూ పెరిగింది. కుప్పలు తెప్పలుగా వచ్చిపడే యాడ్స్‌ క్రికెటర్ల స్థితినే మార్చేశాయి. క్లాస్‌ గేమ్‌ క్రికెట్‌ పూర్తిగా గ్లామర్‌ గేమ్‌గా మారిపోయింది. ప్రపంచీకరణ క్రికెట్‌కు మరింత ఆధరణ తెచ్చిపెట్టింది. దేశగతిని మార్చేసిన 19, 20వ దశకాల్లో క్రికెట్‌ బోర్డు తలరాతనూ మార్చేశాయి. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పుడు భారత్‌ చెప్పిందే వేదం అన్నస్థాయిలో పరిస్థితులు ఉన్నాయి. అదే సమయంలో క్లాస్‌ గేమ్‌లో ఫిక్సింగ్‌ భూతం ప్రవేశించింది. ఆటగాళ్లకు భారీ మొత్తాలు ఎరగా చూపి మ్యాచ్‌ ఫలితాన్నే శాసించే స్థాయిలో ఫిక్సింగ్‌ భూతం జడలు విప్పింది. ఎక్కువ మంది అభిమానులను కూడగట్టుకున్న భారత్‌ మ్యాచ్‌లను ఫిక్స్‌ చేస్తే బుకీల పంటపండేది. 19వ దశకంలో క్రికెట్‌లో వెలుగు చూసిన ఫిక్సింగ్‌ వ్యవహారానికి ఇప్పుడు అండర్‌ గ్రౌండ్‌ మాఫియా తోడైంది. డీ గ్యాంగ్‌గా పిలువబడే దావూద్‌ ఇబ్రహీం, అతడి ముఖ్య అనుచరుడు చోటా షకీల్‌ మరికొందరికి ఇప్పుడు ఫిక్సింగ్‌ ప్రధాన వృత్తి. క్రికెట్‌లో క్రీడాస్ఫూర్తి కరువవుతున్న రోజుల్లో బీసీసీఐ ప్రవేశపెట్టిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఇప్పుడు ఫిక్సింగ్‌ను వెర్రితలలు వేయించింది. గ్లామర్‌ సొబగులు, డబ్బు మూటల మయమైన ఐపీఎల్‌కున్న మార్కెట్‌ను డీ గ్యాంగ్‌ భారీగా సొమ్ము చేసుకున్నట్టు ఐపీఎల్‌`6లో వెలుగు చూసిన స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం ద్వారా తెలుస్తోంది. ఫిక్సింగ్‌ కుంభకోణంలో చిక్కుకుని ముగ్గురు క్రికెటర్లు ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. 19వ దశకంలో వెలుగు చూసిన ఫిక్సింగ్‌ వ్యవహారం దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ కెప్టెన్‌ హ్యాన్సీక్రోనే మరణానికి దారితీసింది. అప్పటి భారత కెప్టెన్‌ మహ్మద్‌ అజరుద్దీన్‌, భవిష్యత్‌ కెప్టెన్‌గా చెప్పుకునే అజయ్‌ జడేజా సహా ఎందరో క్రికెటర్ల భవితవ్యాన్ని బలితీసుకుంది. క్రోనే విమాన ప్రమాదంలో మరణించడంపై అనేక సందేహాలు వెల్లువెత్తాయి. ఫిక్సింగ్‌లో కూరుకుపోయిన కొందరు పెద్దలను కాపాడేందుకు అండర్‌ వరల్డ్‌ మాఫియా అతడిని బలితీసుకుందనే ఆరోపణలున్నాయి. అత్యంత జనాధరణ పొందిన క్రికెట్‌కు మాఫియా చెద పట్టింది. అది పూర్తిగా క్రికెట్‌ను తినేసే ప్రమాదముంది. ఇప్పుడు క్రికెట్‌ చూస్తున్న అభిమానుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ మ్యాచ్‌ ఇదివరకే ఫిక్స్‌ అయిందేమో అని పలువురు టీవీల్లో సైతం మ్యాచ్‌లు చూడటం తగ్గిస్తున్నారు. క్రికెట్‌ను మాఫియా శాసించే స్థాయికి చేరిందంటే టోర్నీల నిర్వహణలో ఎన్నో లోటుపాట్లున్నాయనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని అంగీకరించే పరిస్థితిలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ), భారత క్రికెట్‌ మండలి (బీసీసీఐ) సిద్ధంగా లేవు. కానీ అది ముమ్మాటికీ నిజం. సందేహాల దొంతర్లు ముసురుకున్నప్పుడు మ్యాచ్‌లకు ఆధరణ తగ్గడం ఖాయం. ఫిక్సింగ్‌ను నియంత్రించలేమని ప్రభుత్వం అంటోంది. క్రికెట్‌ మ్యాచ్‌లు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు మన జట్టు విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో ఆయా దేశాల్లో జరుగుతుంటాయి. ఎక్కడో కూర్చొని బుకీలతో ఫోన్లో మాట్లాడి మైదానంలోని క్రికెటర్లను మేనేజ్‌ చేస్తున్న మాఫియాను సర్కారు నియంత్రికపోవచ్చు కానీ ఆటగాళ్లను మాత్రం నియంత్రించగలదు. అలా చేస్తే తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని క్రికెటర్లు గగ్గోలు పెట్టవచ్చు. ఒకరిద్దరు చేసిన తప్పుకు అందరిపై నిఘా పెడతారా అంటూ సర్కారు చర్యను విభేదించవచ్చు. ప్రతిఘటించనూ వచ్చు. కానీ క్రికెట్‌ ఉనికికే ప్రమాదంగా మారిన ఫిక్సింగ్‌ భూతాన్ని పారదోలడానికి చేపట్టే చర్యలకూ అందరూ సహకరించాల్సిన సమయమిది.