క్షతగాత్రులను పరామర్శించడానికే వచ్చా!

3

– రాజకీయం కోసం కాదు

– రాహుల్‌

కోల్‌కతా,ఏప్రిల్‌ 2(జనంసాక్షి): కోల్‌కతా నగరంలో ఫల్‌ఐ ఓవర్‌  కుప్పకూలిన ఘటనాస్థలాన్ని శనివారం కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పరిశీలించారు. ఈ ప్రమాదంలో గాయపడి కోల్‌కతా వైద్యకళాల, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. క్షతగాత్రులను పరామర్శించేందుకే వచ్చానని, రాజకీయం కోసం కాదని స్పష్టం చేశారు. విషాద సమయంలో బాధితులకు అండగా నిలిచేందుకే వచ్చానన్నారు. కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న పైవంతెన కూలి 25 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాదాపు 90 మంది గాయాలపాలయ్యారు. నిర్మాణ సంస్థ ఐవీఆర్‌సీఎల్‌కు చెందిన ముగ్గురు అధికారులను ఇప్పటికేకోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఉదయం రాహుల్‌ గాంధీ కోల్‌కతా చేరుకుని ఫ్లైఓవర్‌ కూలిన ప్రదేశాన్ని పరిశీలించారు.  తర్వాత ఆయన కోల్‌కతా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. గాయపడ్డ వాళ్లను పరామర్శించేందుకు వచ్చానని, ఎటువంటి రాజకీయ ప్రకటన చేయదలుచుకోలేదని రాహుల్‌ అన్నారు. బ్రిడ్జి కూలడం ఓ విషాదం అని, ఇటువంటి సమయాల్లో బాధితులకు వీలైనంత అండగా నిలవాలన్నారు. సంఘటనను రాజకీయం చేయరాదన్నారు.