ఖబ్జాకోర్ ఖబర్దార్..!
హైదరాబాద్,మార్చి 16(జనంసాక్షి):
నగరంలోని కబ్జాలను బయటకు తీయిస్తామని సీఎం కల్వ కుంట్ల చంద్రశేఖ ర్‌రావు అన్నారు. ఆదివారం ఆయన బస్తీబాటలో భాగంగా నగరంలోని నాగోల్ ప్రాంతంలో పర్యటించారు. మమతానగర్ కాలనీ వాసులతో ముఖా ముఖిలో పాల్గొన్నారు. వెంకటరమణ కాలనీలో పర్యటించారు. అంతకు ముందు ఆయన కాలనీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… మన బస్తీ బాగు కోసం మనమే నడుము బిగించాలని కోరారు. ప్రజలంతా సంఘటిత కృషితో పనిచేస్తే కాలనీలు బాగుపడతాయని తెలిపారు. నగరంలోని కబ్జాలను బయటకు తీయిస్తామని సీఎం అన్నారు. బీహెచ్‌ఈఎల్ వద్ద ఉన్న ప్రగతి రిసార్ట్స్‌లోకి ఒక్క దోమ కూడా రాదని దాన్ని అంత బాగా, అంత పరిశుభ్రంగా ఏర్పాటు చేసుకున్నారని వివరించారు. ప్రగతి నగర్ తరహాలో హెర్బల్ ప్లాంట్లతో కాలనీల్లో పార్కులు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
‘చెత్తను రోడ్లపై వేయకండి’
మన ఇళ్లు మాత్రమే బాగుంటే లాభంలేదని మన గల్లీలు కూడా పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. రోడ్లపై చెత్త వేయకండని కోరారు. జీహెచ్‌ఎంసీ అధికారులు కాలనీలోని ఇంటింటికి ప్లాస్టిక్ డబ్బాలు అందిస్తారని అందరు వాటిలో చెత్తను జమచేసి బయట కుండీలో వేయాలని కోరారు. రోడ్లుపై చెత్త వేయొద్దని విజ్ఞప్తి చేశారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే దోమలు రావని, రోగాలు సంక్రమించవని తెలిపారు. వ్యాధులు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. హైదరాబాద్ పరిస్థితి బయట షేర్వానీ, అందర్ పరేషానీ అన్న చందంగా తయారైందని తెలిపారు. సీఎం నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఒక్కొక్క బస్తీలో తిరుగుతూ సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తారని సీఎం వివరించారు.
‘భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి
వెంకటరమణ కాలనీ వాసులు తమ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. దీంతో కాలనీకి భద్రత ఏర్పడుతుందని తెలిపారు. కాలనీ వాసులు చందాలు వసూలు చేసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అన్నారు. ఈ చందాల నుంచి పేదవారికి మినహాయింపునివ్వాలని కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటు వలన కాలనీలో ఎవరు తిరుగుతున్నారు, కాలనీలోకి ఎవరు వస్తూ పోతున్నారు అనే వివరాలు నమోదు అవుతాయని పేర్కొన్నారు. ఏదైనా నేరం జరిగితే, అమ్మాయిలను ఏడిపిస్తే తెలిసిపోతుందని చెప్పారు. వారిని శిక్షించడానికి ఆస్కారం ఉంటుందని వివరించారు.