ఖమ్మం కార్పోరేషన్‌పై గులాబీ జెండా

3

– కేటీఆర్‌ ధీమా

ఖమ్మం,మార్చి3(జనంసాక్షి):ఖమ్మం పట్టణం గులాబీమయమైంది! కేటీఆర్‌ రోడ్‌ షోలతో పులకించిపోయింది! కార్పోరేషన్‌ ఎన్నికల ప్రచారంలో పింక్‌ పార్టీ దూసుకుపోతోంది. కేటీఆర్‌ రోడ్‌ షోలకు జనం నీరాజనం పట్టారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను తమ ఇంటి పార్టీ అభ్యర్థులుగా భావించి ఓట్లేస్తామంటున్నరు. ఖమ్మం కార్పోరేషన్‌ ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్‌ జోరు కొనసాగుతోంది. ప్రచారానికి ఒక్కరోజే గడువుండటంతో గులాబీ పార్టీ నేతలు ప్రచారం ఉధృతం చేశారు. ఖమ్మం ఎన్నికల ప్రచార పర్వంలోకి మంత్రి కేటీఆర్‌ దిగారు. మంత్రి తుమ్మలతో కలిసి పట్టణంలోని అన్ని డివిజన్లలో కేటీఆర్‌ రోడ్‌ షోలు నిర్వహించారు. తన స్టైల్లో ఎన్నికల ప్రచారాన్ని ¬రెత్తించారు. ఖమ్మం ప్రజలు కేటీఆర్‌ రోడ్‌ షోలకు గ్రాండ్‌ వెల్కం పలికారు! డప్పుల మోతతో.. కోలాటాల ఆటలతో.. హుషారెత్తించే పాటలతో.. దుమ్మురేపే డాన్స్లతో.. బంగారు బతుకమ్మలతో? జై తెలంగాణ నినాదాలతో జనం భారీగా తరలివచ్చారు.భారీగా తరలివచ్చిన ఓటర్లకు.. రెపరెపలాడుతున్న గులాబీ జెండాలకు ధీటుగా మంత్రి కేటీఆర్‌ ప్రసంగం సాగింది. కేటీఆర్‌ ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటాలా దూసుకెళ్లాయి. ఆయన వాగ్ధాటి ప్రతిపక్షాలపై ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలయ్యాయి. 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని.. 20 నెలల్లో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేటీఆర్‌ ప్రజలకు వివరించారు. ఖమ్మం పట్టణంలోని పాండురంగాపురం, యూపీహెచ్‌ కాలనీ, రోటరీ నగర్‌, వైరారోడ్‌, అంబేద్కర్‌ సెంటర్‌, బోనకల్లు క్రాస్‌ రోడ్డు, ముస్తాఫా నగర్‌, చర్చ్‌ కాంపౌండ్‌, జడహీర్పురా, ప్రకాశ్‌ నగర్‌, బోస్‌ సెంటర్‌, పంపింగ్‌ వెల్‌ రోడ్‌, గాంధీ చౌక్‌, సారథి నగర్‌, రాపర్తి నగర్‌, ఆర్టీఓ ఆఫీస్‌, గట్టయ్య సెంటర్‌, సరితా క్లీనిక్‌, బస్టాండ్‌ సెంటర్‌, రేవతి సెంటర్‌.. ఖమ్మం ఖిల్లా దాకా.. కేటీఆర్‌ రోడ్‌ షో గ్రాండ్‌ గా సాగింది. కేటీఆర్‌ ప్రసంగం ఆద్యంతం ప్రజలను ఆకట్టుకుంది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ సాగింది. ఖమ్మం అంటే ఉద్యమాల గుమ్మం అన్న కేటీఆర్‌.. పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌ ది అన్నారు. మాటల సీఎంగా కాకుండా.. చేతల సీఎంగా కేసీఆర్‌ నిరూపించుకున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే ఖమ్మం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు. ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ గెలవడం ఖాయమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ను అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. ఇప్పటి వరకు ఖమ్మంలో 10 వేల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చామన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గెలిచిన టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్లందరూ ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తారని తుమ్మల భరోసా ఇచ్చారు. కేటీఆర్‌ రోడ్‌ షోలతో టీఆర్‌ఎస్‌ ప్రచారం తారాస్థాయికి చేరింది. డివిజన్లలో ప్రచారానికి వెళ్తున్న టీఆర్‌ఎస్‌ నేతలకు ప్రజలు సాదర స్వాగతం పలుకుతున్నారు. కారు గుర్తుకు ఓటేసి గులాబీ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తమంటున్నారు.  రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ  ఏవిధంగా ఉండాలనే విషయంలో తమకు ఓ లెక్క పద్దతి ఉందని, దాని ప్రకారం దేశంలో ఎక్కడా లేని విదంగా పది జిల్లాలను సమగ్రంగా అభివృద్ది చేసి చూపిస్తామని అప్పటివరకు టీఆర్‌ఎస్‌ విశ్రమించపోదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఖమ్మం నగరాన్ని కూడా హైదరాబాద్‌కు సమాంతరంగా అభివృద్ది చేస్తామని, ఇందుకోసం ప్రణాళికలను సిద్దం చేస్తున్నామన్నారు. తెలంగాణకు వరప్రదాయిని అయిన గోదావరి జలాలను అన్ని జిల్లాలకు తరలించి ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్లు ఇప్పిస్తామన్నారు. మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహిస్తున్నామని, ఎర్పాటుచేసుకున్న లక్ష్యం మేరకు వాటర్‌ గ్రిడ్‌ పనులను పూర్తి చేసి ప్రతి ఇంటికి నీరందిస్తామన్నారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వేసే ప్రతి ఓటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వేసినట్లేనన్నారు. ఖమ్మం కార్పోరేషన్‌లో గులాబి జెండా ఎగురవేసేందుకు ప్రజలు తమ కార్పోరేటర్లను గెలిపించాలని మంత్రి కోరారు. ప్రతిపక్షాల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిలేదన్నారు. వారు కొత్తగా చేసేది కూడా ఏమిలేదన్నారు. కార్పోరేషన్‌లో టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టగానే వచ్చే మార్పులను రుచి చూడాలనుకుంటేనే తమ పార్టీకి ఓటువేయాలన్నారు. రాష్ట్రాన్ని 67 ఏళ్లు పాలించిన టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు రెండు కూడా నగరాలను, పట్టణాలను, ఇంకా ఇంకా కుగ్రామాలుగా ఉంచేందుకు ప్రయత్నించాయని ఆయన ఆరోపించారు. ఖమ్మం కార్పోరేషన్‌ అభివృద్దిని తానే స్వయంగా చేపడుతానన్నారు. ఏచిన్న సమస్య వచ్చినాకూడా నగర వాసులు తనవద్దకువచ్చినా పరిష్కరించేందుకు సిద్దంగా ఉంటానన్నారు. అభివృద్ది పలాలు ఏవిధంగా ఉండాలో చేసి చూపిస్తామని మంత్రి కేటీఆర్‌ ఖమ్మం వాసులకు హామి ఇచ్చారు. రోడ్‌షోలో జీహెచ్‌ఎంసి   మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.