గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటి

1

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): శాసన సభ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు గురువారం సాయంత్రం గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సమావేశాల చివరి రోజు గురువారం శాసనసభలో సాగునీటిప్రాజెక్టులపై నిర్వహించిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ వివరాలను సీఎం కేసీఆర్‌ గవర్నర్‌కు తెలిపినట్లు సమాచారం. 2016-17కి సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదం కోసం గవర్నర్‌కు సమర్పించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, గవర్నర్‌ ముఖ్యకార్యదర్శిగా హర్‌ప్రీత్‌సింగ్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు.

ఐటీ పాలసీ ఆవిష్కరణకు రావాలని గవర్నర్‌కు ఆహ్వానం

ఏప్రిల్‌ 4న జరగనున్న నూతన ఐటీ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని పంచాయతీరాజ్‌, ఐటీశాఖల మంత్రి కె.తారకరామారావు గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలుసుకుని ఈ మేరకు ఆహ్వానించినట్లు తెలిసింది.