గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

4
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. పలు అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. ఇటీవల గవర్నర్‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో… తాజా భేటీ ప్రాధాన్యంగా మారింది. రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. ఉద్యోగులు, సంస్థల విభజన అంశాలపై కూడా చర్చించారు. వీటితో పాటు తాజా పరిణామాలపై చర్చించిటన్లు తెలిసింది. రాష్ట్రంలో కరవు, వేసవితీవ్రత, తాగునీటి సరఫరా ఏర్పాట్లపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇదిలావుంటే  తెలంగాణ మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో మరోసారి స్వల్ప మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని గవర్నర్‌తో ప్రస్తావించి ఉంటారని భావిస్తున్నారు. కేటీఆర్‌కు  పరిశ్రమల శాఖ, జూపల్లి కృష్ణారావుకు గ్రావిూణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేటీఆర్‌ ఇప్పటికే పంచాయితీరాజ్‌, ఐటీతో పాటు మున్సిపల్‌ శాఖలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పారిశ్రామిక విధానంలో దూసుకుపోతున్న తరుణంలో డైనమిక్‌గా ఉన్న కెటిఆర్‌కు పరిశ్రమల శాఖను కట్టబెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. కాగా రెండు, మూడు రోజుల్లో శాఖల మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇక గతంలోనూ మంత్రుల శాఖల్లో మార్పులు జరిగిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరికి విద్యా శాఖ కేటాయించి, అప్పటి వరకు విద్యా శాఖ మంత్రిగా ఉన్న జగదీష్‌ రెడ్డికి విద్యుత్‌ శాఖను, మంత్రి లక్ష్మారెడ్డికి వైద్య, ఆరోగ్య శాఖను కేటాయించారు. ఈ మార్పులపై ప్లీనరీకి ముందా లేక తరవాతనా అన్నది వేచిచూడాలి.