గుజరాత్, ఢిల్లీలో హై అలర్ట్
– ఉగ్రముప్పు పొంచి ఉందని ఐబీ హెచ్చరికలు
న్యూదిల్లీ,మార్చి6(జనంసాక్షి): దేశంలోని ప్రధాన నగరాలకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. గుజరాత్‌తో సహా ముఖ్యమైన మెట్రో నగరాల్లో దాడులు నిర్వహించేందుకు కుట్ర జరిగినట్లు సమాచారం వచ్చింది. దేశంలోని కీలకమైన ప్రాంతాలపై దాడులు నిర్వహించేందుకు పాకిస్థాన్ నుంచి దాదాపు 10 మంది అనుమానితులు సరిహద్దులు దాటి ఉత్తరాది రాష్ట్రాలను చేరుకొన్నట్లు సమచారం. వీరంతా సముద్ర మార్గాన గుజరాత్ చేరుకొన్నట్లు భావిస్తున్నారు. గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. అన్ని చోట్ల పోలీసులకు సెలవులు రద్దు చేశారు. 200 మంది ఎన్‌ఎస్‌జీ సిబ్బందిని దిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు పంపించారు. దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సందేశాలు పంపించారు. ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
దిల్లీలో ఉగ్ర కదలికలు
దేశ రాజధాని దిల్లీలోనూ ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి. లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దిల్లీలోకి చొరబడినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ హెచ్చరికలతో దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.