గుట్ట పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
గవర్నర్‌తో కలిసి సందర్శన
ఆలయ అభివృద్ధిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
యాదగిరిగుట్ట,మే30(జనంసాక్షి): నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలోని యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్, చినజీయర్ స్వామి శనివారం నాడు శంకుస్థాపన చేశారు. సిఎం కెసిఆర్, గవర్నర్ దంపతులు, చినజీయర్ స్వామికి ఘనస్వాగతం లభించింది. ఆలయంలో వీరికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి దర్శనం చేసుకున్నారు. పూజారులు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. ఆలయ పూజారులు, వేదపండితులు వీరికి స్వాగతం పలికి స్వామిదర్శనం చేయించి ఆశీర్వచనం పలికారు. అంతకు ముందు సిఎం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనచేశారు. ఇక యాదాద్రి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన గవర్నర్ నరసింహన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భువనగిరి మండలం వడాయిగూడెంలో హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికారు. హెలిక్టాపర్‌లో గవర్నర్‌తో పాటు చిన్నజీయర్‌స్వామి విచ్చేశారు. వీరికి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన వడాయిగూడెం హెలిప్యాడ్ వద్దకు ముందుగానే చేరుకున్నారు. అనంతరం సీఎం, గవర్నర్, చిన్న జీయర్‌స్వామి రోడ్డు మార్గాన్న యాదాద్రికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్,గవర్నర్ రాక సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయ ప్రాంగాణాన్ని పోలీసులు ఖాళీ చేయించారు.
శంకుస్థాపన చేసిన అనంతరం సీఎం కేసీఆర్ యాదగిరి గుట్ట ఆలయ పునిర్నిర్మాణ నమూనాను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు.యాదాద్రి అభివృద్ధిపై యాదగిరిగుట్టలోని సంఘీభవన్‌లో ఏర్పాటుచేసిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిలకించారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేపట్టాక యాదాద్రి ఎలా ఉంటుందో చూపేలా అధికారులు దీనిని రూపొందించారు. సీఎంతో పాటు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, చిన్నజీయర్‌స్వామి, భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, యాడా వైస్ చైర్మన్ కిషన్‌రావు తదితరులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించారు. ఆలయ డిజైన్‌ను ఆరెకరాల నుంచి మూడున్నర ఎకరాల్లో చేపట్టేందుకు సీఎం ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రెండు, మూడేళ్లలో ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తిచేస్తామని హావిూ ఇచ్చారు. ఆనందసాయి ఇచ్చిన డిజైన్‌ను చినజీయర్ స్వామి సూచనలతో త్వరలోనే తుదిరూపం ఇస్తామని స్పష్టం చేశారు. హెచ్‌ఎండీఏ తరహాలో వైటీడీఏ పరిధిలోని ఆరు గ్రామాల్లో భూవినియోగంపై మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. 2069 ఎకరాల్లో అభయారణ్యం, వసతీ గృహాలు, పార్క్‌లను అభివృద్ధి చేస్తామని సీఎం పేర్కొన్నారు. యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి అథారిటీ కూడా సిఎంతో భేటీ అయింది. యాదగిరిగుట్ట దేవాలయం ప్రాంగణంలో ఉన్న ఆండాళ్ నిలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కొనసాగింది. భూసేకరణ కమిటీ, అటవీ, రెవెన్యూశాఖ అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, చినజీయర్‌స్వామి పాల్గొన్నారు.
యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి కోసం శనివారం శిలాన్యాస పర్వాన్ని చేపట్టారు. ఆలయ పునర్ నిర్మాణంలో భాగంగా దివ్యవిమాన గోపురం ఎత్తు పెంచే కార్యక్రమానికి సుముహూర్తపూజ నిర్వహించారు. ప్రభుత్వ ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి అథారిటి వైస్‌చైర్మన్ జి.కిషన్‌రావు, జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, జేసీ సత్యనారాయణ, భువనగిరి ఆర్డీవో మధుసూధన్, సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞశర్మ, ఆలయ ఈవో గీత, ధర్మకర్త నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. సిఎం వెంట భువనగిరి ఎంపి బూరనర్సయ్య గౌడ్, స్తానిక ఎమ్‌ఎల్యే గొంగడి సునీత, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి ఉన్నారు.