గుదిబండగా మారిన రాజోలిబండ
ఆయకట్టుకు కన్నీరే
యేటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం
సీమాంధ్ర సర్కారు వివక్షకు నిదర్శనం
మహబూబ్‌నగర్, జనవరి 29 (జనంసాక్షి) :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన, అత్యల్ప వర్షపాతం గల జిల్లా మహబూబ్‌నగర్. దేశవ్యాప్తంగా నిర్మాణ మవుతున్న ప్రాజెక్టులు, కట్టడాల్లో పాలమూరు కూలీల స్వేధం చిందాల్సిందే. ఉన్న ఊరును, కన్నవారిని వదిలి కాగితపు గుడిసెల్లో కాలం వెళ్లదీస్తూ రక్తాన్ని చెమటగా మార్చే ఇక్కడి కార్మికులకు ఇంతటి దుర్గతి పట్టించిన వారు సీమాంధ్ర పాలకులు. వెనుకబడిన ప్రాంతంగా ముద్రవేసి వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా తృతీయశ్రేణి పౌరులుగా మార్చేశారు. జిల్లాలోని గద్వాల, ఆలంపూర్ తాలూకాల పరిధిలో ప్రధాన సాగునీటి వనరు ఆర్డీఎస్‌ను సీమాంధ్ర పాలకులు నిర్లక్ష్యం చేశారు. భాషాప్రయోక్త రాష్ట్రల పేరుతో అత్యంత దోపిడీకి గురైన ప్రాంతాలు కూడా గద్వాల, ఆలంపూర్ తాలూకాలే. నిజాం ఇక్కడి ప్రజల కన్నీళ్లను తుడిచేందుకు ముందు చూపుతో నిర్మించిన ప్రాజెక్టు రాష్ట్రాల పునర్వ్యస్థీకరణతో ఉనికిని కోల్పోయింది. ప్రాజెక్టులో కొంతభాగం కర్ణాటక పరిధిలోకి వెళ్లగా, ప్రాజెక్టు ఎక్కువగా కర్నూల్ జిల్లాలో ఉండిపోయింది. అత్యధిక సాగు విస్తీర్ణం ఒకప్పుడు జిల్లాలో ఉన్నా ఇప్పుడది నామమాత్రమే. జిల్లాకు 4.2 టీఎంసీల నీటిని కేటాయించినా అంతమొత్తం ఇక్కడి రైతులకు అందడం లేదు. సీమాంధ్ర పాలకులు రాయలసీమకు నీళ్లు మళ్లించుకు పోవడానికి, కర్నూల్, కడప (కేసీ) కాలువకు ఎక్కువ సామర్థ్యం తో నీటిని తరలించేందుకు బాంబులు పెట్టి మరి ఆర్డీఎస్ సొరంగమార్గం విస్తీర్ణాన్ని పెంచారు. అప్పటి నుంచి పాలమూరు జిల్లా రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ప్రాజెక్టులోకి చేరుతున్న ఎక్కువ నీటిని రాయలసీమ రైతులే వినియోగించుకుంటున్నారు. పాలమూరు మళ్లు ఎండబెట్టి అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం డిమాండ్‌తో ఇప్పుడు ఉద్యమ పథాన నడుస్తున్న బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆర్డీఎస్ తూములు పగుల గొట్టి అక్రమంగా నీటిని తరలించుకెళ్లివారే. కానీ పాలమూరు రైతుల పక్షాన పోరాడేందుకు మన ప్రజాప్రతినిధులెవరూ అంతగా మొగ్గు చూపడం లేదు. నామ మాత్రంగా ఉద్యమాలు చేస్తూ తర్వాత కనిపించకుండా పోతున్నారు. ఫలితంగా ఆర్డీఎస్ పరిధిలోని రైతులకు కన్నేళ్లే మిగులుతున్నాయి. జిల్లాలో కాలువ 42 కిలోమీటరు తరువాత ఉన్న డిస్టిబ్య్రూటరీలలో కేవలం 27వ డిస్టిబ్య్రూటరీ వరకు మాత్రమే నీరు వస్తోంది. 0 కిలోమీటరు నుంచి కాలువ పొడవునా నీటిని అక్రమంగా వాడుతున్నారు. దీనిపై ఇంతవరకు అజమాయిషీ లేదు. ఇక జిల్లాలోకి ప్రవేశించే సరికి కాలువల నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో నీరు ముందుకు వెళ్లడం లేదు. 2011 ఖరీఫ్‌లో 23,400ల ఎకరాలకు నీరివ్వగా, రబీలో కేవలం 1,300ల ఎకరాలకు మాత్రమే నీరిచ్చారు. 2012 ఖరీఫ్‌లో 23,600ఎకరాలకు నీరివ్వగా, రబీలో మూడు వేలఎకరాలని సాగునీటి శాఖ అధికారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లా అధికారులు పంపే ప్రతిపాదనలపైనే నీటి కేటాయింపులు ఆధారపడి ఉంటున్నాయి. తుంగభద్ర డ్యాం నిబంధన ప్రకారం పంపే ప్రతిపాదనల్లో ఐదు టీఎంసీలకు పైగా కర్నూలు జిల్లాకు, కేవలం మూడు టీఎంసీలు మాత్రమే మహబూబ్‌నగర్ జిల్లాకు కేటాయిస్తున్నారు. ఇది చాలా తక్కువగా ఉంటోంది. ఇటీవల 1,950 క్యూసెక్యుల నీటిని వదిలేందుకు అంగీకరించిన అధికారులు ఆ మొత్తం కూడా ఇవ్వలేదు. జిల్లాకు 4.2 టీఎంసీల నీటి కోసం ప్రతిపాదనలు పంపించారు. ఇందులో కేవలం 3.8 టీఎంసీలు మాత్రమే జిల్లాకు చేరాయి. ఇక పోతే కర్నూలు జిల్లాకు సంబంధించి ఐదు టీఎంసీల నీటి వాటాకు గాను, వారు మూడు టీఎంసీలు వాడుకున్నారు. ఇంకా రెండు టీఎంసీలను తాగునీటి కోసం నిల్వ ఉంచుకున్నారు. ఆర్డీఎస్ ఆయకట్టు కింద ఉన్న పొలాలు దెబ్బతినకుండా ఉండాలంటే మరో వారం రోజుల పాటు నీటిని వదలాలని రైతులు కోరుతున్నారు. దీంతో 1950 క్యూసెక్యుల నీటిని నాలుగు రోజులు మాత్రమే వదిలేందుకు అంగీకరించారు. అలాగే నీటిని ఈనెల 23న వదిలారు. తాజాగా వదిలిన నీటిపై కర్నూలు జిల్లాలో వివాదం మొదలయింది. మన నీటిని ఎలా వారికి వదులుతారని, వారికి సంబంధించిన ఇండెంటు పూర్తయిందని, మహబూబ్‌నగర్ జిల్లాకు నీటి విడుదలను ఆపాలని కర్నూలు జిల్లా ఎస్‌ఈపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. కాగా నీటిని విడిచిపెట్టినట్లు అక్కడి అధికారులు చెబుతున్నా అవి జిల్లాకు చేరలేదని జిల్లా అధికారయంత్రాంగం పేర్కొంటోంది. దీంతో ఈసారి రైతులకు పస్తులు తప్పేలా లేవు.