గోదావరిని ముంచేస్తున్న కాలుష్యం

పట్టణాల మురికి.. పరిశ్రమల వ్యర్థాలతో నష్టం
ప్రమాద ఘంటికలను పట్టించుకోని ప్రజలు
కరీంనగర్‌/రాజమండ్రి,ఆగస్ట్‌26 (జనం సాక్షి )  : గోదావరి ప్రారంభం నుంచి సముద్రంలో కలిసేవరకూ అనేకచోట్ల కాలుష్యం కారణంగా గోదావరి కలుషితం అవుతోంది. పలు గ్రామాలు, పట్టణాల వ్యర్థాలను నదిలోకి తోసేస్తున్నారు. నది ఒడ్డున ఇరువైపులా అనేక పట్టణాలున్నాయి. గ్రామాలూ పెద్దసంఖ్యలోనే ఉన్నాయి. మహారాష్ట్రలో త్రయంబకేశ్వర్‌, నాసిక్‌, కోపర్‌గావ్‌, నాందేడ్‌.. తెలంగాణలో బాసర, ధర్మపురి, గోదావరి ఖని, మంథని, కాళేశ్వరం, కోటిలింగాల, భద్రాచలం… ఆంధప్రదేశలోని కొవ్వూరు, రాజమండ్రి, రావులపాలెం, నర్సాపురం, రాజోలు.. దిగువన యానాం(పుదుచ్చేరి) తదితర ఊళ్లనుంచి వచ్చే మురికినీరంతా గోదావరిలోనే కలుస్తుంది. ఈ నీటిని శుద్ధిచేయాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో ముప్పు పెరుగుతోంది. ఇక.. గోదావరి వెంట ఉన్న పరిశ్రమలగురించి చెప్పుకోనే అక్కర్లేదు! ఉదాహరణకు.. గోదావరి నదికి ఉపనదిగా ఉన్న కిన్నెరసానిపై కేటీపీఎస్‌ పవర్‌ప్రాజెక్టు, భద్రాచలం పేపర్‌బోర్డు కర్మాగారం, హెవీ వాటర్‌ ప్రాజెక్ట్‌, సింగరేణి పరిశ్రమలు ఖమ్మం జిల్లాలో ఉండగా.. కొత్తగా మణుగూరు సవిూపంలో థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు కూడా నిర్మాణం జరుగుతోంది. కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోనూ గోదావరి నదిపైన, ఉపనదులపైన పలు పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల నుంచి వదిలే వ్యర్థాలు, మురికినీరు అంతా గోదావరిలోకి చేరి కలుషితమవుతోంది. ఖమ్మం జిల్లాలో కేటీపీఎస్‌ నుంచి వదులుతున్న బూడిద కిన్నెరసాని జలాలను కలుషితం చేసి గోదావరిలో కలుస్తుండగా, భద్రాచలం పేపర్‌బోర్డు కర్మాగారం నుంచి వస్తున్న మురికినీరు సైతం గోదావరిలోనే కలుస్తుంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో టీఎ?సజెన్‌కో థర్మల్‌ కేంద్రం, ఎన్టీపీసీ యాష్‌ పాండ్‌, సింగరేణి పవర్‌హౌస్‌ నుంచి ప్రతిరోజూ 30 ఎంఎల్‌డీల వ్యర్థజలాలు గోదావరిలో కలుస్తున్నాయి. రాజమహేంద్రవరంలోనూ పేపర్‌మిల్లు, హార్లిక్స్‌ ఫ్యాక్టరీ, అనేక హోటళ్లు, దేవాలయాల నుంచి వచ్చే మురుగు, వ్యర్థాల తుది గమ్యం గోదావరే. గంగానది మాదిరిగా గోదావరి నదిని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి గోదావరి పవిత్రతను కాపాడతామని కేంద్రం ప్రకటించింది. దీనికి ఇప్పటి వరకు ఎలాంటి నిధులు మంజూరు కాకపోవటంతో పనులు చేపట్టలేదు. దశాబ్దన్నర క్రితం అప్పటి కేంద్ర ప్రభుత్వం గోదావరి జలకాలుష్య నివారణ ప్రాజెక్టును ప్రారంభించి ఉమ్మడిరాష్ట్రంలో గోదావరి ఖని, భద్రాచలం, మంచిర్యాల, రాజమండ్రి పట్టణాల్లో గోదావరి ఘాట్ల నిర్మాణం, మురికినీటిని శుద్ధిచేసే కార్యక్రమానికి కొంత నిధులు కేటాయించి పనులు చేపట్టి వదిలేసింది. అప్పట్లో రూ.70 కోట్లతో ఈప్రాజెక్టు చేపట్టాలని కొన్నిచోట్ల పనులు నిర్వహించారు. భద్రాచలంలో కూడా రూ.3 కోట్లు ఖర్చుచేశారు. తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోదావరి జలకాలుష్య ప్రాజెక్టుపై శీతకన్ను వేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. దీంతో అప్పటిదాకా చేసిన పనులు కూడా నిరుపయోగమయ్యాయి. మళ్లీ ఎప్పటిలాగానే ఆయా పట్టణాల్లో మురికి నీరు గోదావరిలో కలుషితం అవుతోంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికైనా గోదావరి
నదిని జలకాలుష్యం నుంచి విముక్తి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త కార్యాచరణ చేపడితే తప్ప ఆ నదీమతల్లి జలకాలుష్య రక్కసి నుంచి బయటపడే అవకాశాలు లేవని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోదావరి నదికి పెనుగంగ, వైన్‌గంగ, వార్ధా, మంజీర, ఇంద్రావతి, బిందుసార, ప్రవరా, ప్రాణహిత, మానేరు, తాలిపేరు, కిన్నెరసాని, శబరి, సీలేరు, తదితర ఉపనదులున్నాయి. పరిశ్రమలు విడుదల చేస్తున్న మురికినీరు ఆ ఉపనదులతో పాటు ప్రవహించి గోదావరిలో కలిసి కలుషితం చేస్తున్నాయి. దీనికితోడు.. గోదావరిలో లాంచీల్లో, మరపడవల్లో నిత్యం వేలాదిగా పర్యటించే పర్యాటకులు వినియోగించే ప్లాస్టిక్‌ కూడా గోదావరిలో జలచరాల పాలిట పెనుముప్పుగా మారుతోంది. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు చేసే తరుణంలో వాడే షాంపులు, సబ్బులు.. వాటిని పెట్టుకోవడానికి తెచ్చే ఎª`లాస్టిక్‌ సంచులు అన్నీ గోదావరిలోనే! ఫలితంగా గోదావరిలో మత్స్యసంపద కూడా కనుమరగైపోతోంది. గోదావరిలో ఒకప్పుడు పెద్ద ఎత్తున మత్స్య సంపద జరిగేది. జలకాలుష్యం కారణంగా మత్స్య సంపద పూర్తిగా రానురానూ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.