గోదావరి , కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్లాలి

4A

నీటి ప్రాజెక్టులపై తీర్మానం ప్రవేశ పెట్టిన హరీష్‌

ఖమ్మం,ఏప్రిల్‌27(జనంసాక్షి):

ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో భాగంగా రెండో తీర్మానం.. గోదావరి, కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలె.. మేజర్‌ ఇరిగేషన్‌తో మన పంటలు పండాలె అని మంత్రి హరీష్‌ రావు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. మనకు జలపాఠాలు చెప్పిన నిపుణులు సీఎం కేసీఆర్‌ అని తెలిపారు. గోదావరి, కృష్ణ నీటి వాటా కోసం ఉద్యమ సమయంలోనే జలసాధన చేపట్టామని గుర్తు చేశారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక చేస్తుందన్నారు. సమైక్య పాలకులు మన ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. అందుకే ఇప్పుడుప్రాజెక్టులను రీ డిజైన్‌ చేసుకుంటూ కోటి ఎకరాలకు నీరు అందించాలన్న లక్ష్యంతో సాగుతున్నామని అన్నారు. దాశరథి నా తెలంగాన కోటి రతనాల వీణ అని అంటే..మన సిఎం కెసిఆర్‌ మన తెలంగాణ కోటి ఎకరాల మాగాణా అని ముందుకు సాగుతున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగానికి తీరని అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చేలా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ప్రజెంటేషన్‌ను యావత్‌ దేశం మెచ్చుకుందని చెప్పారు. కాళేశ్వరంలో 5 జిల్లాలు       మిగతా 2లో సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. దీంతో తొలుల లబ్ది పొందేది వరంగల్‌ జిల్లా అని అన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకుని లోయర్‌పెన్‌గంగకు టెండర్లు పిలుస్తున్నామని పేర్కొన్నారు. మేజర్‌ కింద లక్ష, మైనర్‌ కింద లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.  గత పాలకులు హడావుడిగా దేవాదుల శంకుస్థాపన చేశారని తెలిపారు. పాలమూరును దత్తత తీసుకుని చంద్రబాబు చేసిందేవిూ లేదని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల దేశానికే ఆదర్శం కావాలన్నారు. వలసపోయిన వాళ్లంతా తిరిగి రావాలె అన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టుల కోసం ఎంత ఖర్చయినా భరిస్తామని ఉద్ఘాటించారు. యుద్ధ ప్రతిపాదికన భక్తరామదాసు ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు. నిజాంసాగర్‌లో చుక్కనీరు లేదు, నిజాంసాగర్‌కు నీళ్లొస్తే నిజామాబాద్‌ ధాన్యభాంఢాగారమవుతుందన్నారు. గతంలో మెదక్‌ జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు, ఇప్పుడు సీఎం మెదక్‌ జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నారని చెప్పారు. ఇరిగేషన్‌ శాఖతో నా జన్మ ధన్యమైందన్నారు. రూ. 25 వేల కోట్ల బడ్జెట్‌తో రైతుల కన్నీళ్లు తుడుస్తున్నామని తెలిపారు.