గ్రామస్థాయి సమాచారమే కీలకం

గ్రామ పరిపాలనలో వీఆర్‌ఓలది కీలకపాత్ర. రైతుల ఆత్మహత్యలు, పంటనష్టం నివేదికలు, పంటల సాగు వివరాలు, కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు, భూమి కొలతలు, భూ వివరాల నమోదు, పట్టాపాస్‌ పుస్తకాల అందజేత, ప్రకృతి విపత్తుల అంచనా తదితర వాటిని గ్రామాల్లో వీఆర్‌ఓలే చూసుకోవాలి. ఈ పనులను కాగితాల రూపంలో అందించడంతో సేవలు ఆలస్యమవుతున్నాయి. ఫలితంగా రైతులు, ఇతర పనులు కావాల్సిన వారు వీరి చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయానికి వెళ్తే.. ఇతర పనివిూద బయటకు వెళ్లారని.. అక్కడంటే ఇక్కడ.. ఇలా ప్రజలు కాళ్లరిగేలా తిరుగుతున్నా పనులు మాత్రం అయ్యేవి కావు. అంతో ఇంతో ముట్టజెప్పినివారికి పనులు అవుతున్న దుస్థితి ఉంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కాగితరహిత పాలనతో పాటు క్షేత్రస్థాయిలో వీఆర్‌ఓల పనితీరును మెరుగుపర్చడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చు. గ్రామస్థాయి సమాచారం నిక్షిప్తం అయితే తప్ప నిర్ణయాలు తీసు కోవడం కుదరదు. ఈ రకంగా సమాచారం కీలకం కావాల్సి ఉంది. ఏ గ్రామంలో ఏ వివరాలు కావాలన్న కంప్యూటర్‌ నొక్కితే వచ్చే విధంగా ఉండాలి. క్షణాల్లో సమాచారం అందడం కోసం తెలుగు రాష్ట్రాల్లో గ్రామస్థాయి సమాచారాన్ని సేకరించారు. సమాచారం ఆధారంగా పనులు కూడా జరిగేలా చేస్తే సమస్యలు ఉండవు. గ్రామాల్లో విపత్తులు  మొదలు, ధాన్యంసేకరణ తదితర పనులను విఆర్‌వోలకు అప్పగించి సమాచారం తెచ్చుకోవడం సులువు. ఈ రకంగా సమాచార సేకరణలో ప్రభుత్వాలు ముందుగా పక్కా ప్లాన్‌ చేయాలి. తెలంగాణ ఏర్పడ్డ తరవాత సిఎం కెసిఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా గ్రామస్థాయిలో సమాచారం అంతా అరచేతిలో ఉండేలా చేస్తున్నారు. గ్రామ స్థాయిలో అవినీతి, అక్రమాలను నిరోధించి రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, ఇందుకోసం గ్రామ రెవెన్యూ అధికారు(వీఆర్‌ఓ)లకు బాధ్యతలను అప్పగించింది. వారికి ట్యాబ్‌లను అందజేయడం ద్వారా సమస్త గ్రామ సమాచారం అందులో నిక్షిప్తం అయ్యేలా చేసింది.  వీటికి జీపీఎస్‌  విధానం అనుసంధానం చేయడంతో సమాచారం మొత్తం సిఎం కెసిఆర్‌కు వెంటనే చేరనుంది. ఎక్కడ ఏ గ్రామ సమాచారం కావాలన్నా సిఎంకు ఇక చిటికెలో పని. ఇందుకోసం వారికి ట్యాబ్‌లను అందజేసి శిక్షణ ఇచ్చారు. దీంతో ఇక సమస్త సమచారం అందుబాటులోకి వచ్చింది. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట పడడమే గాకుండా తప్పించుకునే వీలు కుదరదు. వీఆర్‌ఓల పనితీరును ఇంటర్‌ నెట్‌ ఆధారంగా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఈ పక్రియ ద్వారా కాగిత రహితంతో పాటు పారదర్శక పాలనకు మార్గం సుగమం కానుంది. ట్యాబ్‌లకు జీపీఎస్‌ వ్యవస్థ అనుసంధానించి ఉండటంతో అందులో వివరాలు నమోదు చేయగానే వెంటనే స్థానిక తహసీల్దార్‌ నుంచి రాష్ట్ర భూపరిపాలనశాఖ కమిషనర్‌ వరకు క్షణాల్లో సమాచారం తెలిసిపోతుంది. ప్రభుత్వం వీఆర్‌ఓలకు అందజేసిన ట్యాబ్‌లలో వారికి సంబంధించిన గ్రామాలు, వారి పరిధిలో భూమి, ఇతరాత్ర వివరాలను విధిగా పొందుపర్చారు. నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. పంటనష్టం వివరాలు, పహనీల సమాచారం, పట్టాదార్‌ ఆధార్‌ అనుసంధానం, ప్రకృతివిపత్తులకు సంబంధించిన 26 అంశాలు ఇందులో చేర్చారు. గ్రామాల్లో ప్రకృత్తి విపత్తుల వల్ల పంట నష్టం జరిగితే వీఆర్‌ఓలు సంఘటన స్థలానికి వెళ్లకుండా కార్యాలయం నుంచే అంచనా వివరాలు ప్రభుత్వానికి అందజేస్తుంటారు. గ్రామాల్లో అగ్నిప్రమాదాలు, ఇతరాత్ర నష్టానికి సంబంధించి వివరాలను ప్రత్యక్షంగా చూడకుండా అంచనావేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తుండేవారు. దీంతో బాధితులకు నష్టం వాటిల్లేది. ఇక నుంచి అలాంటి పద్ధతులకు స్వస్తి పలకనున్నారు. గ్రామాల్లో పంటనష్టంతో పాటు 
అగ్నిప్రమాదాలు, భూమి కొలతలు తదితర వాటిని కచ్చితంగా అక్కడికి వెళ్లి అంచనా వేయాలి. నష్టం జరిగిన ప్రాంతాన్ని చిత్రం తీసి సంఘటన స్థలం నుంచే అంతర్జాలం ద్వారా నష్టం వివరాలను నమోదు చేయాలి. వీటితో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాల జారీలోనూ జాప్యం జరుగుతోంది. ప్రజలు నెట్‌ ద్వారా  దరఖాస్తులు చేసుకోగానే వాటిని పరిశీలించి 15 రోజుల్లోగా ధ్రువపత్రం అందేలా చర్యలు చేపట్టారు. వీఆర్‌ఓలు క్షేత్రస్థాయికి వెళ్లిన సందర్భంగా అక్కడి రైతుల వద్ద కొన్ని సందర్భాల్లో ఆధార్‌కార్డు జిరాక్స్‌ ప్రతులు ఉండవు. దీంతో వారు పట్టణకేంద్రాలకు జిరాక్స్‌ల కోసం వచ్చి ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి బాధలను సైతం తప్పించేందుకు ఈ విధానం దోహదపడనుంది. జిరాక్స్‌లతో సంబంధించి వెంటనే రైతుల వద్ద నుంచి ఆధార్‌ సంఖ్యలను ఈ ట్యాబ్‌ల ద్వారా నమోదు చేయవచ్చు. ఇలా గ్రామంలోని ప్రజలకు సంబంధించిన పనులకు ఈ విధానం ద్వారా నమోదు చేయడం వల్ల వీటి పరిష్కారంపై ఉన్నతాధికారులు సైతం దృష్టిసారిస్తారు. నేరుగా సిఎం కార్యాలయానికి  అనుసంధానం కానుండడంతో బాధ్యతతో అప్రమత్తంగా ఉండడానికి అవకాశం ఏర్పడింది. ఎపిలోనూ ఇలాంటి ప్రయత్నాలే చేశారు. మొత్తం కమాండ్‌ కంట్రోల్‌కు సమాచారం చేరవేసేలా చర్యలు తీసుకున్నారు. సమాచార సేకరణ అన్నది జరిగితే దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం సులభం కానుంది. ఈ రకంగా పాలనలో కూడా పారదర్శకత వస్తుంది. అయితే దీనిని ఎంతమేరకు ఉపయోగించుకుంటారన్నది పాలకులను బట్టి ఉంటుంది.
………………………