గ్రూప్‌- 2 రెండు నెలల వాయిదా

1

హైదరాబాద్‌,మార్చి26(జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్‌ 24, 25న జరగాల్సిన ఈ పరీక్షలను రెండు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యోగాల సంఖ్య పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఆర్‌ఆర్‌బీ పరీక్షల దృష్ట్యా ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్షలను కూడా ప్రభుత్వం వాయిదా వేసింది. కానిస్టేబుల్‌ పరీక్ష ఏప్రిల్‌ 3న జరగాల్సి ఉంది. ఎస్‌ఐ పరీక్షలో ఇంగ్లీష్‌ పేపర్‌కు వెయిటేజీ నిబంధనను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర నియామక పరీక్షలు ఉన్న రోజుల్లో రాష్ట్ర నియామక పరీక్షలు జరపవద్దని ఈ నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగులు, యూనివర్సిటీ విద్యార్తులు కూడా వీటిని వాయిదా వేయాలని కోరుతున్నారు. దీంతో వాయిదాకు నిర్ణయించారు.  గ్రూప్‌-2 ఉద్యోగాలను వాయిదా వేయాలని, 439 నుంచి 3,500 వరకు పోస్టులను పెంచాలని, ఇంటర్వ్యూ విధానాన్ని ఎత్తివేయాలని, కానిస్టేబుల్‌, ఆర్‌ఆర్‌బీ పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగుల నుంచి గత కొంత కాలంగా డిమాండ్‌ కూడా వస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 24, 25 తేదీలలో గ్రూప్‌-2 పరీక్ష జరగాల్సి ఉండగా రెండు నెలలు వాయిదా పడ్డాయి.

ప్రభుత్వంతో సంప్రదించి కొత్త తేదీలు త్వరలోనే వెల్లడిస్తాం

ప్రభుత్వంతో సంప్రదించి కొత్త తేదీలు త్వరలోనే వెల్లడిస్తామని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధికారులు తెలిపారు. ప్రభుత్వ సూచనతోనే గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వెస్తున్నట్లు తెలిపారు.