చంద్రబాబు కనుసన్నల్లోనే.. కాంగ్రెస్‌ తొలి జాబితా

– బాబు ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది

– కేసీఆర్‌ నాలుగేళ్లలో చేసింది శూన్యమే

– బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యం

– బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు

హైదరాబాద్‌, నవంబర్‌13(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ సోమవారం అర్థరాత్రి ప్రకటించిన జాబితా చూస్తే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని, చంద్రబాబు కనుసన్నల్లోనే తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్ధులను ప్రకటించిందని బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ప్రతిపక్షంగా పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్‌ విడుదల చేసిన 65 అభ్యర్థులు ప్రజలతో ఉన్న నేతలు కాదని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎక్కడా గెలిచే అవకాశం లేదని జోస్యం చెప్పారు. మహా కూటమి ఓనర్‌ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడని ఎద్దేవా చేశారు. ఈ తెలంగాణ వ్యతిరేక కూటమికి మెజారిటీ సీట్లు వస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారో కాంగ్రెస్‌ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. మెజార్టీ సీట్లు వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి, లోకేష్‌ ¬ంమంత్రి అవుతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీని చంద్రబాబు కబ్జా చేశారని అన్నారు. రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్‌ పార్టీని నేతలు చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు.

కర్ణాటకలో కుమార స్వామి మాదిరిగా టీడీపీకి తక్కువ సీట్లు వచ్చినా చంద్రబాబు సీఎం పదవి చేపడతారని, కర్ణాటక మోడల్‌ రాజకీయాన్ని కాంగ్రెస్‌ తెలంగాణలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్రంలో అవినీతి రహిత పాలన కొనసాగిస్తున్న బీజేపీకి ఓటేస్తారా లేక అన్నిరంగాల్లో విఫలమైన టీఆర్‌ఎస్‌కు ఓటేస్తారా లేక తెలంగాణ ఆత్మగౌరవాన్ని టీడీపీకి తాకట్టు పెట్టిన కాంగ్రెస్‌కు ఓటేస్తారా తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. మిషన్‌ భగీరథతో నీళ్లు రాకపోతే ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడెందుకు ఓట్లు అడుగుతున్నారని సూటిగా ప్రశ్నించారు. నాలుగేళ్ల పాలనలో కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. కేవలం హావిూలే తప్ప.. ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. తెలంగాణ ప్రజలందరూ బీజేపీవైపు చూస్తున్నారని అన్నారు.