పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ భారత్‌లో భాగం : ` అమిత్‌షా


పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌.. భారత్‌లో అంతర్భాగమని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా (ంఎతిబి ూష్ట్రజీష్ట్ర) పునరుద్ఘాటించారు. పాక్‌ అణుశక్తిపై కాంగ్రెస్‌, ఇండియా కూటమి నేతలు ప్రజల్లో భయాలు రేపుతున్నారని మండిపడ్డారు. 370 అధికరణ రద్దు చేస్తే.. దేశంలో రక్తపాతం జరుగుతుందని రాహుల్‌ గాంధీ బెదిరించారని.. అయితే ఐదేళ్లయినా ఎవరు ఒక్కరాయి కూడా విసరలేదని గుర్తు చేశారు.కాగా ఒకరు చేసిన పొరబాటు కారణంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)పై భారత్‌ తాత్కాలిక నియంత్రణ కోల్పోయిందని విదేశాంగ మంత్రి జై శంకర్‌ పేర్కొన్నారు. ’విశ్వబంధు భారత్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ హయాంలో జరిగిన తప్పులను ఎత్తిచూపారు. లక్ష్మణ రేఖను దాటి పీవోకేను భారత్‌ విలీనం చేసుకుంటుందా? అని అడిగిన ప్రశ్నకు.. జై శంకర్‌ స్పందిస్తూ.. ‘లక్ష్మణ రేఖ లాంటివి ఉన్నాయంటే నేను నమ్మను. పీవోకేను భారత్‌లో భాగంగానే భావిస్తున్నా. కొందరి బలహీనత వల్ల అది చేజారింది. పీవోకేపై పట్టు కోల్పోయేందుకు వారి పొరబాటే కారణం అని పరోక్షంగా నెహ్రూను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. విశ్వవేదికపై మన స్థానాన్ని బలంగా ఉంచుకోవాలని భావిస్తున్నానని.. స్వీయ విశ్వాసాన్ని ఎన్నడూ వీడకూడదని అన్నారు. పదేళ్లక్రితం ఎవరూ ఇలా మాట్లాడి ఉండకపోవచ్చంటూ కాంగ్రెస్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. భారత్‌ విషయంలో చైనా చేపట్టిన చర్యలను ఆ దేశంలో రాయబారిగా ఉన్నప్పుడు గమనించా. ఆ దేశం తీరు మనందరికీ బాగా తెలుసు. అది పాకిస్థాన్‌తో (సీపెక్‌ను ఉద్దేశిస్తూ) కలిసి పని చేస్తోంది. తమది కాని భూభాగాలను ఆక్రమించుకోలేరని ఆ రెండు దేశాలకు చాలాసార్లు స్పష్టంచేశాం. వాటిపై భారత్‌దే హక్కు‘ అని అన్నారు. పీవోకే విలీనంపై చైనా ప్రతిస్పందనపై అడిగిన ప్రశ్నకు జై శంకర్‌ ఈవిధంగా స్పందించారు.