చట్టం తనపని తాను చేసుకొని పోతుంది

13

విపక్షాల తీరుపై మండిపడ్డ కేటీఆర్‌

హైదరాబాద్‌,మార్చి7(జనంసాక్షి):  తెలంగాణ శాసనసభలో టిడిపి  సభ్యులు ప్రవర్తన శోచనీయమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీడీపీ నాయకులు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఏ అపచారం జరిగిపోయిందని తెలంగాణ టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన వారిపై సరైన సమయంలో స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ‘తాను చేస్తే సంసారం, మరోకరు చేస్తే వ్యభిచారం’ చందంగా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు. పార్టీ ఫిరాంయిపులపై కాంగ్రెస్‌ మాట్లాడడం వింతల్లోకెల్ల వింత అని కేటీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ… సభలో ఎలా ప్రవర్తించాలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని టిడిపి  సభ్యులు అడిగారని ఆరోపించారు. అక్కడేమో ప్రతిపక్ష సభ్యులను పచ్చకండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు… ఇక్కడేమో ప్రతిపక్ష సభ్యులు తెరాసలో చేరితే వారు అపచారం చేశారని అంటున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో పక్కరాష్ట్ర సీఎం చంద్రబాబు చేస్తున్నదేంటని కేటీఆర్‌ టీడీపీ సభ్యులను ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఇంగితజ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  పక్కరాష్ట్రం సీఎం చెప్పినట్టు వ్యవహరించడం సిగ్గుచేటు. పక్కరాష్ట్ర సీఎం చేస్తున్నదేంటి. ఇతర పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకోవటం లేదా? చంద్రబాబు ఇప్పుడు రెండు నాల్కల సిద్ధాంతం మొదలుపెట్టిండు. పార్టీలు మారిన అంశం కోర్టులో ఉన్నది. చట్టం తన పని తాను చేసుకుపోతది. టీడీపీ అధికారంలోకి వస్తే హుస్సేన్‌సాగర్‌లో అమరవీరుల స్థూపం కడ్తడతామంటూ  హంతకులే సంతాపం తెలపడం విడ్డూరంగా ఉందన్నారు.  2004 నుంచి 2010 వరకు కొందరు తెరాస నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. అప్పుడు వైఎస్‌ చేసిన పనికి జానారెడ్డి, జీవన్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌లు చప్పట్లు కొట్టి ఈలలు వేశారన్నారు. ఆనాడెందుకు వారికి ఫిరాయింపులు కనిపించలేదన్నారు. కాంగ్రెస్‌ సభ్యుల తీరుపై మంత్రి స్పందిస్తూ.. పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్‌ ప్రోత్సహించలేదా? టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు. వైఎస్‌ ముందు ఒక్క మాట మాట్లాడే ధైర్యంలేని వాళ్లు ఇప్పుడు మాట్లాడటం సిగ్గుగా ఉందన్నారు.  తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు వచ్చే ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోతామని మంత్రి స్పస్టంచేశారు. తెలంగాణ అభివృద్ధే మా లక్ష్యం. విపక్షాలు సలహాలు, సూచనలు చేస్తే స్వీకరిస్తం. కుసంస్కారంగా వ్యవహరిస్తే సరైన బుద్ది చెప్తమని ఆయన పేర్కొన్నారు.  ప్రజలకిచ్చిన హావిూలన్నింటిని తప్పకుండా నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్‌ మరోసారి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్కు వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ సమావేశాలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తుందని..బంగారు తెలంగాణ కోసం సీఎం అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కు న్యాయం చేయడమే తమ బాధ్యత అని తెలిపారు. సీఎం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు