చర్చిద్దాం రండి
టీ ఎంపీలకు వాయలార్ ఢిల్లీపిలుపు
రాజీనామాలతో కేంద్రంలో కదలిక
హైదరాబాద్, జనవరి 29 (జనంసాక్షి):
తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడికి హైకమాండ్ తలొగ్గింది. చర్చలకు రావాలని ఢిల్లీకి ఆహ్వానించింది. దీంతో టీ-కాంగ్రెస్ ఎంపీల రాజీనామాల వ్యవహారం వాయిదా పడింది. జనవరి 28లోగా తెలంగాణపై ప్రకటన చేస్తామన్న కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం.. మరిన్ని చర్చలు, సంప్రదింపులు జరగాల్సి ఉందని, నిర్ణయం తీసుకొనేందుకు సమయం పడుతుందని రెండ్రోజుల క్రితం ప్రకటించింది. తెలంగాణ వచ్చేస్తుందని భావించిన తరుణంలో హైకమాండ్ షాక్ ఇవ్వడంతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు బిత్తరపో యారు. ఇంతకాలం పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి తెలంగాణ కోసం పోరాడుతుంటే.. అధిష్టానం ‘చేయివ్వడం’పై మండిపడ్డారు. ఇక కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్న మైందని భావించిన టీ-ఎంపీలు సోమవారం సమావేశమై పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఎంత ఒత్తిడి పెంచినా హైకమాండ్ పట్టించుకోక పోవడంపై ఆగ్రహంతో ఉన్న ఎంపీలు.. ప్రత్యేక తెలంగాణ కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని తీర్మానించారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలు సమర్పించాలని, తాము పార్టీని, పదవులను ఎందుకు వీడుతున్నామో తెలుపుతూ సోనియాకు లేఖ రాయాలని ఆ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే, పార్టీని వీడడంపై కొన్ని భేదాభిప్రాయాలు రావడంతో తుది నిర్ణయం తీసుకోనేందుకు మంగళవారం కేకే నివాసంలో సమావేశమయ్యారు.పార్టీకి, పదవులకు రాజీనామా చేసే అంశంపై ఎంపీలు తర్జనభర్జనలు పడ్డారు. దాదాపు నాలుగు గంటలకు పైగా చర్చించారు. పార్టీని వదలడం సరికాదని మధుయాష్కీ పేర్కొన్నారు. ఎప్పుడూ సమావేశా టలకు ఆలస్యంగా వచ్చి వ్యూహాన్ని చెడగొడు తున్నారని మధుయాష్కీపై గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామాలపై మల్లగుల్లాలు పడుతున్న తరుణంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ప్రత్యేక పరిశీలకుడు వాయలర్ రవి… మధుయాష్కీకి ఫోన్ చేశారు. రాజీనామాలు వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్న వాయలర్… ఢిల్లీకి వస్తే చర్చిద్దాం అని సూచించారు. తెలంగాణపై స్పష్టత వచ్చే సమయంలో రాజీనామాలు వద్దని వారించారు. ఢిల్లీకి వస్తే అన్ని విషయాలపై చర్చిద్దామని సూచించారు. అధిష్టానం పిలుపుతో ఎంపీలు కొంత మెత్తబడ్డారు. అయితే, రాజీనామాలు విషయంలో వెనుకగుడు వేయొద్దని.. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖలను నేరుగా సోనియాగాంధీకి ఇవ్వాలని నిర్ణయించారు. భేటీ అనంతరం ఎంపీ పొన్నం మాట్లాడుతూ.. హైకమాండ్ చర్చలకు పిలిచిందని తెలిపారు. వాయలర్ రవి స్వయంగా ఫోన్ చేసి ఢిల్లీకి రావాలని ఆహ్వానించారన్నారు. అధిష్టానంతో చర్చించేందుకు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపారు. అయితే, రాజీనామాల నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్ర విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ, తెలంగాణ ఆకాంక్షకు అనుగణంగా వ్యవహరించామని చెప్పారు. తెలంగాణ తెచ్చే బాధ్యతలను భుజాన వేసుకొని హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణ తెచ్చేది ఇచ్చేది కాంగ్రెస్సే అని చెప్పిన మాటలకు కట్టుబడి ఉద్యమిస్తున్నామన్నారు. అన్ని విధాలుగా ఒత్తిడి తీసుకువచ్చామని, తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటు కోసం కఠిననిర్ణయాలు తీసుకున్నామన్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పించాలన్న నిర్ణయంలో మార్పు లేదని తెలిపారు. మంత్రులు కూడా హైకమాండ్‌పై ఒత్తిడి పెంచే కార్యక్రమాలు తీసుకురావాలని సూచించారు. తెలంగాణ సాధన దిశగా మంత్రులు దశదిశా నిర్దేశిస్తే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి బాటలో నడుస్తారన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని, తెలంగాణ సాధనే లక్ష్యమని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో వెనుకడుగు వేసేది లేదని, అధిష్టానంపై ఒత్తిడి పెంచే చర్యలు కొనసాగిస్తామని పొన్నం తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పోరాటం కొనసాగిస్తామన్నారు. హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్తున్నామని, తమ వాణిని సమర్థవంతంగా వినిపిస్తామని తెలిపారు.తెలంగాణ ఇవ్వకుంటే పార్టీలో కొనసాగే పరిస్థితి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు తెలిపారు. తెలంగాణ ఇస్తారో లేదో తేల్చి చెప్పాలని ఆయన కోరారు. రాజీనామా లేఖలను సోనియాగాంధీకే సమర్పిస్తామని చెప్పారు. తెలంగాణ ఇవ్వకుంటే పార్టీలో కొనసాగే పరిస్థితి లేదని, పదవుల్లో ఉండలేమని సోనియాకు విన్నవిస్తామన్నారు. వ్యక్తిగతంగా రాజీనామా చేస్తే స్పీకర్‌కు లేఖ సమర్పించాల్సి ఉంటుందని.. అయితే, తెలంగాణ కోసం తెచ్చే ఒత్తిడిలో భాగంగా రాజీనామాలు చేస్తున్నాం కాబట్టే అధినేత్రి లేఖలను సమర్పిస్తామన్నారు. కలుపుకుపోదామని హైకమాండ్ పెద్దలు సంకేతాలు ఇచ్చారు కాబట్టి ఢిల్లీ వెళ్తామన్నారు. వేలాది మంది విద్యార్థుల ఆత్మబలిదానాలు వృథా పోకూడదని శోకతప్త హృదయంతో కఠినమైన నిర్ణయం తీసుకున్నామని ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో సోనియాకు పంపిస్తున్నామని, తెలంగాణ ప్రక్రియను మొదలు పార్టీలో ఉండలేమని లేఖలో స్పరరష్టం చేశామన్నారు. ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని, అయితే చర్చల పేరుతో కాలయాపన తగదన్నారు. ఏ చర్చలు చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మినహా దేనికీ ఒప్పుకొనిది లేదన్నారు. 15వ లోక్‌సభలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందేనని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రాంత ప్రజల సుదీర్ఘ పోరాటం నేపత్యంలో.. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా భారమైన హృదయంతో కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఎంపీ మందా జగన్నాథం అన్నారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సమయంలో తమ ఒత్తిడి మేరకు అఖిలపక్షం పెట్టారని, కానీ, ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల్లో ప్రకటన చేయకపోవడం సరికాదన్నారు. గడువు పూర్తి కాకముందే.. ఆజాద్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడడంపై జగన్నాథం మండిపడ్డారు. చర్చల పేరిట కాలయాపన తప్ప జరిగేదేవిూలేదన్నారు. ముందు రెండు ప్రాంతాలు అన్నారు.. తర్వాత మూడు ప్రాంతాల వారితో చర్చలంటున్నారు.. సీఎం, పీసీసీ చీఫ్‌లతో చర్చలంటూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీలమంతా గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ ఇవ్వకపోతే పార్టీలో ఉండడం కష్టమేనని పేర్కొన్నారు. తెలంగాణ కోసం రాజీనామాలు సహా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని మధుయాష్కీ అన్నారు. కేవీపీ లాంటి తెలంగాణ ద్రోహులను కట్టడి చేస్తేనే ప్రత్యేక రాష్ట్రం వస్తుందన్నారు.