చర్చిద్దాం రా!

5

– ‘ఉమా’కు హరీశ్‌ ఫోన్‌

– సానుకూలంగా స్పందించిన దేవినేని

హైదరాబాద్‌,మే4(జనంసాక్షి):నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్టాల్ర  మధ్య నెలకొన్న అనిశ్చితికి తెర దించేందుకు ఏపీ సర్కార్‌తో చర్చించాలని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఫోన్‌  చేశారు. నీటి పారుదల ప్రాజెక్టులపై చర్చించేందుకు సమావేశం అవుదామని ఈ సందర్భంగా హరీశ్‌ కోరారు. ఆర్డీఎస్‌తో పాటు తెలంగాణ నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించుకుందామని సూచించారు. అందుకు మంత్రి దేవినేని ఉమ కూడా అంగీకారం తెలిపారు. సమావేశం ఏర్పాటు చేయాలని హరీశ్‌కు  దేవినేని ఉమ తెలిపారు. కాళేశ్వరం, ఆర్డీఎస్‌ ప్రాజెక్టుల శంకుస్థాపనలతో ఇరు రాస్ట్రాల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీనిపై ఎపి ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ ప్రాజెక్టులు అక్రమమంటూ కేంద్రానికి లేఖరాస్తామని కేబినేట్‌ నిర్ణయించింది. ఈ దశలో నీటి కేటాయింపులకు అనుగుణంగానే ప్రాజెక్టులు చేపట్టామని తెలంగాణ సర్కార్‌ ప్రకటించింది. ఈ దశలో ఇరు రాస్ట్రాల నేతలు పరస్పర వాగ్బాణాలు, విమర్శలు చేసుకుంటున్న తరుణంలో హరీష్‌ రావు చొరవ తీసుకుని మంత్రి దేవినేనికి ఫోన్‌ చేశారు. దీనికి స్పందించిన దేవినేని కూడా ముందు నీటి వాటాలపై చర్చిద్దామని అన్నారు.  ఇరు రాష్టాల్ర నీటి వాటాపై ముందు చర్చిద్దామని, అవసరమైతే కేంద్రమంత్రి ఉమాభారతి సమక్షంలో ఇరు రాష్టాల్ర  సీఎంల భేటీకి సిద్ధమని దేవినేని ఉమా తెలిపినట్లు హరీశ్‌రావు చెప్పారు. ఆర్డీఎస్‌ ప్రాజెక్టుపై చర్చిద్దామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఫోన్‌ చేసినట్లు మంత్రి దేవినేని విశాఖలో వెల్లడించారు. అన్ని ప్రాజెక్టులపై చర్చించేందుకు సిద్ధమని హరీశ్‌రావుతో చెప్పినట్లుగా పేర్కొన్నారు. కేంద్రం అనుమతులు తీసుకొని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని హరీశ్‌రావును కోరానని వెల్లడించారు. అన్ని అంశాలను అపెక్స్‌ కమిటీ ముందు చర్చిద్దామని, కర్ణాటక, మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులపై కలిసి పోరాడుదామని ప్రతిపాదించినట్లు చెప్పారు. అనుమతులు తెచ్చుకుని ప్రాజెక్టులు కట్టుకుంటే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసినట్లు దేవినేని వెల్లడించారు.తెలంగాణలోనిర్మిస్తున్న ప్రాజెక్టులపై దేవినేని విూడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రాజెక్టుల వల్ల నాగార్జున సాగర్‌, కృష్ణాడెల్టా తీవ్రంగా దెబ్బతింటాయని, హైదరాబాద్‌కు తాగునీరు అందించడం కష్టమవుతుందని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులతో తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులు కూడా నష్టపోతారన్నారు. కృష్ణా పరివాహక పరిధిలో ప్రాజెక్టుల కింద నీటి లభ్యత తక్కువగా ఉందని, ప్రకాశం బ్యారేజీ వద్ద ఎన్నడూ లేని విధంగా నీటిమట్టం 4 అడుగులకు పడిపోయిందని తెలిపారు. 6 టీఎంసీల నీటిని వెంటనే విడుదల చేయాలని కృష్ణా బోర్డుకు లేఖ రాసినట్లు ఉమా వెల్లడించారు. ఇదిలావుంటే ప్రతిపక్ష నేత జగన్‌ ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తూ జనాలను మోసం చేస్తున్నారని దేవినేని ఉమా విమర్శించారు. నాగార్జున సాగర్‌లో చుక్క నీరు లేనప్పుడు తాగునీరు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. ఓ వైపు నిర్వాసితులను రెచ్చగొడుతూ.. మరో వైపు పోలవరం పనులు పూర్తి కాలేదంటున్నారని విమర్శించారు.