చారిత్రాత్మక అడుగులు

4

– క్యుబాలో ఒబామా పర్యటన

హవానా,మార్చి21(జనంసాక్షి):మరికొన్ని నెలల్లో అమెరికా అధ్యక్ష పదవీకాలం పూర్తి కానుండగా బరాక్‌ ఒబామా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. క్యూబా అధ్యక్షుడు రావుల్‌ కాస్ట్రోతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనేందుకు ఆ దేశ రాజధాని హవానా చేరుకున్నారు. 1959 విప్లవం తర్వాత క్యూబా వెళ్లిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా నిలిచారు. దాంతో ఆ రెండు దేశాల మధ్య దశాబ్ధాలుగా ఉన్న టెన్షన్‌ వాతావరణం ఓ రకంగా తగ్గింది. కుటుంబ సమేతంగా వెళ్లిన ఒబామా.. హవానాలో అమెరికా ఎంబసీని ప్రారంభించారు. తన పర్యటనను చరిత్రాత్మకంగా అభివర్ణించారు. అక్కడి పాతబస్తీలో ఆయన పర్యటించారు. ఇవాళ రావుల్‌ క్యాస్ట్రోను ఒబామా కలుసుకోనున్నారు. అయితే, ఇద్దరు దేశాధినేతలు వాణిజ్యం, రాజకీయ సంస్కరణలపై మాట్లాడనున్నారు. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో ఫస్ట్‌ లేడీ మిచెల్‌, కుమార్తెలు సాషా, మాలియాతో ఒబామా క్యూబా చేరుకున్నారు. ఈ పర్యటనలో క్యూబా విప్లవ నాయకుడు, మాజీ అధ్యక్షుడు పిడేల్‌ క్యాస్ట్రోను ఒబామా కలుసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. క్యూబాలో 1959లో విప్లవం విజయవంతమైన తర్వాత ఆ దేశంపై అమెరికా ఒత్తిడి పెంచింది. ఆర్థిక ఆంక్షలు విధించి ఇతర దేశాలు సహకరించకుండా కట్టడి చేసింది. అయినా విప్లవ నాయకుడు ఫిడేల్‌ కాస్ట్రో నాయకత్వంలో ఆ దేశం కమ్యూనిస్ట్‌ పంథా నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అనేక దేశాల్లోని మానవతావాదులు, అభ్యుదయవాదులు ప్రత్యక్షంగా, పరోక్షంగా క్యూబాకు అండగా నిలిచాయి. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న దేశాలపై యుద్ధాలు చేసిన అమెరికా.. ఆ దేశానికి కేవలం 98 కిలోవిూటర్ల దూరంలో ఉన్న క్యూబాను మాత్రం ఏం చేయలేకపోయింది. చివరికి చర్చలకు దిగివచ్చింది. ఐతే, అమెరికా మార్పులో నిజాయితీ ఎంత అనేది భవిష్యత్తులో తేలనుంది.